ప్రజాశక్తి-అమరావతి : అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎసిబి హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాజీవ్, మండల సర్వేయర్ అజ్మీర రమేష్‌లను తమ కస్టడీకి అప్పగించేందుకు తిరస్కరిస్తూ ఎసిబి ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని కొట్టేయాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రాజీవ్, రమేష్‌లను విచారించడం చాలా అవసరమని ఎసిబి పేర్కొంది. ఎసిబి ప్రత్యేక కోర్టుకు ఈ విషయాలను నివేదించినా ప్రయోజనం లేకపోయిందని వివరించింది. రాజీవ్‌ను తమ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరింది. న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవరి గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. ప్రతివాదులు జోగి రమేష్, అజ్మీర రమేష్‌లకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
బెయిల్ సవాలు చేస్తూ పిటిషన్…
రాజీవ్, రమేష్‌లకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎసిబి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి చక్రవర్తి ఈ వ్యాజ్యాన్ని రోస్టర్ ప్రకారం తగిన బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా, అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో రాజీవ్, సర్వేయర్ రమేష్‌లకు ఎసిబి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ గత నెల 23న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
టేకు చెట్లు, యంత్రాలను రక్షించాలని
అగ్రిగోల్డ్ పిటిషన్
కష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో బ్యాంకు జప్తులో తమ టేకు చెట్లు, ఇతర యంత్ర సామాగ్రి దొంగతనానికి గురవుతున్నాయని, వాటిని రక్షించాలని ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. బ్యాంకు, అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుపై ఏం చేశారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
మిధున్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
హత్యాయత్నం కింద నమోదు చేసిన కేసుల్లో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కపాసాగర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు జిల్లా, పుంగనూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం జస్టిస్ కపాసాగర్ ముందు విచారణకు వచ్చాయి. మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఇవే కేసులకు సంబంధించి మరికొందరు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారని, అన్నింటినీ కలిపి విచారించాలని పోలీసుల తరపు న్యాయవాది మర్రి వెంకటరమణ అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అన్ని వ్యాజ్యాలను కలిపి తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
పాస్‌పోర్టు పునరుద్ధరించాలని పిటిషన్
తన పాస్‌పోర్టు పునరుద్దరించేందుకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హైకోర్టును ఆశ్రయించారు. తనపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్న కారణంతో పాస్‌పోర్టు పునరుద్ధరణను తిరస్కరించడం సుప్రీంకోర్టు తీర్పులకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధమంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా తన పాస్‌పోర్టును పునరుద్ధరించేలా పాస్‌పోర్ట్ అధికారిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. యుఎస్‌ఎ, లాస్ వేగాస్లో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న మైన్ ఎక్స్పో-2024లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందని రవీంద్ర తన పిటిషన్లో పేర్కొన్నారు. అత్యవసరంగా విచారణ జరపాలన్న రవీంద్ర తరపు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.