జివిఎంసి జోనల్‌ కమిషనర్‌పై ఎసిబి దాడులు

  • ఒకేసారి ఆరుచోట్ల సోదాలు

ప్రజాశక్తి – మధురవాడ (విశాఖపట్నం) : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎసిబి అధికారులు విశాఖ జివిఎంసి జోన్‌ – 2 కమిషనర్‌ పొందూరు సింహాచలం ఇంటిపై మంగళవారం దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి రోజంతా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఇళ్లు, కార్యాలయంలో తొలుత సోదాలు జరిపారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఎసిబి డిజి అతుల్‌ సింగ్‌ ఆదేశాల మేరకు విశాఖ అధికారులు స్థానిక స్పెషల్‌ జడ్జి అనుమతితో మొత్తం ఆరు ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. మధురవాడ మిధిలాపురి కాలనీలో ఉన్న సింహాచలం ఫ్లాట్‌తో పాటు మధురవాడలోని జోనల్‌ కార్యాలయం, శ్రీకాకుళం జిల్లాలోని సింహాచలానికి చెందిన ముగ్గురు బంధువుల ఇళ్లు, హైదరాబాద్‌లోని బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు ఏకకాలంలో సాగాయి. విశాఖలోని మద్దిలపాలెంలో ఫ్లాట్‌, నగరంలోని నాలుగు ఇళ్ల స్థలాలు, శ్రీకాకుళంలో 13 ఇళ్ల స్థలాలు, విజయవాడలో ఒక ఇంటి స్థలం, శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, ఒక మారుతి బ్రిజా కారు, బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తులో రూ.2 కోట్ల విలువైన ఆస్తులు ఆదాయానికి మించి కలిగి ఉన్నట్లు తెలిసింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎసిబి జెడి ఎం.రజని, అదనపు ఎస్‌పి ఎన్‌.విష్ణు, డిఎస్‌పి బివిఎస్‌.నాగేశ్వరరావు, డిఎస్‌పి రమ్య పర్యవేక్షణలో జరిగిన ఈ సోదాల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు ప్రాంతాల ఎసిబి అధికారులు పాల్గొన్నారు. త్వరలోనే సింహాచలాన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెడతామని దర్యాప్తు అధికారి, విశాఖ ఎసిబి ఇన్‌స్పెక్టర్‌ వైకె.కిషోర్‌ కుమార్‌ తెలిపారు.

➡️