కార్పొరేషన్‌ అధికారులపై ఎసిబి దర్యాప్తు

– ప్రభుత్వానికి బిల్డర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:గుంటూరు కార్పొరేషన్‌లో కొంతమంది అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ బిల్డర్లును ఇబ్బందిపెడుతున్నారని నెరెడ్కో, క్రిడారు సంస్థలతో పాటు లైసెన్స్డ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ నాయకులు ఆరోపించారు. కమిషనర్‌, సిటీప్లానర్‌, డిప్యూటీ సిటీప్లానర్‌ అవినీతి అక్రమాలపై విజిలెన్సు, ఎసిబితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో నగర ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవాలని కోరారు. గుంటూరులో ఓ హోటల్‌లో మంగళవారం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో నెరెడ్కో అధ్యక్షులు వి.నాగ వంశీ, కార్యదర్శి ఎం.సీతారామయ్య, నాయకులు పి.వి.మల్లికార్జునరావు, యాగంటి దుర్గా ప్రసాద్‌, క్రిడారు అధ్యక్షులు మామిడి రాము, నాయకులు డి.శ్రీనివాసరావు, ఇంజనీర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు దాసరి నాగ శ్రీనివాసరావు మాట్లాడారు. బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో కమిషనర్‌ తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నా కమిషనర్‌ పట్టించుకోవడం లేదన్నారు. ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ జారీలో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం రాకపోవడంతో పాటు తమ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు.

➡️