ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో, కృష్ణా ప్రతినిధి : ఫార్ములా ఇ-రేసు వ్యవహారంలో గ్రీన్‌కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహరం తెరపైకి రావడంతో మంగళవారం గ్రీన్‌కో కార్యాలయాలపై ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ కార్యాలయంలో, కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్‌కో ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఉదయం 11 గంటలకు హైదారాబాద్ నుంచి తొమ్మిది మంది ఎసిబి అధికారుల బృందం మచిలీపట్నంలోని గ్రీన్‌కో కార్యాలయానికి చేరుకుంది. రాత్రి ఎనిమిది గంటల వరకు సోదాలు నిర్వహించింది. సోదాలు ముగిసేవరకూ ఎవ్వరిని లోపలకు అనుమతించలేదు. లోపలవారిని బయటకు రావడానికి అనుమతించలేదు. సోదాలు ముగిసిన తర్వాత ఎటువంటి వివరణ ఇవ్వకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. మీడియాతో గ్రీన్‌కో ఎజిఎం సురేష్ మాట్లాడుతూ.. బందరులోని సంస్థ కార్యాలయాన్ని గెస్ట్ హౌస్‌గా ఉపయోగించుకుంటున్నామని, ఎసిబి అధికారులకు తెలిపామన్నారు. ఎసిబి అధికారులు కోరిన విధంగా ఇంటి పన్ను, కరెంటు బిల్లులను అందించామన్నారు. మాదాపూర్ కార్యాలయంలోని రికార్డులు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అకౌంట్స్ సిబ్బందిని విచారించారు.
ఫార్ములా-ఇ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారాసకు రూ.41 కోట్లు ఇవ్వడంపై అవినీతి నిరోధకశాఖ దృష్టి సారించింది. 2022 అక్టోబరు 25న రేసు నిర్వహణకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగగా.. అంతకు ముందు అదే ఏడాది ఏప్రిల్‌లో రూ.31 కోట్లు, అక్టోబరులో రూ.10 కోట్లు గ్రీన్‌కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చడంపై ఎసిబి ఆరా తీస్తోంది. మరోవైపు ఫార్ములా-ఇ కేసులో విచారణకు రావాలని కెటిఆర్‌కు ఎసిబి రెండోసారి నోటీసులు ఇచ్చింది.