మాజీ డిప్యూటీ సిఎం పిఎ నివాసాల్లో ఎసిబి సోదాలు

  • 43 రకాల ఆస్తులు గుర్తింపు
  • భారీగా బంగారం, వెండి స్వాధీనం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, కోటబొమ్మాళి : మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్‌ పిఎ గొండు మురళి ఇళ్లు, కార్యాలయంలో ఎసిబి అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, జలుమూరు మండలం లింగనాయుడుపేట, బుడితి, శ్రీకాకుళం నగరంతో పాటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేపట్టారు. ఈయన గతంలో బుడితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో సోదాలు చేసినట్లు తెలిసింది. సోదాల్లో 43 రకాల స్థిర, చర ఆస్తులను గుర్తించినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు. 35 ఎకరాల భూమి, ఐదు ఇళ్లు, రెండు కార్లు గుర్తించారు. రాత్రి ఏడు గంటల సమయానికి 900 గ్రాముల బంగారం, సుమారు 15 కేజీల వెండి గుర్తించినట్లు ఎసిబి డిఎస్‌పి రమణమూర్తి చెప్పారు. వీటితో పాటు విలువైన డాక్యుమెంట్లు, మరికొన్ని రకాల ఆస్తి పత్రాలను గుర్తించామని చెప్పారు. ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, బ్యాంకు పత్రాలు, బ్యాంకు లాకర్‌ల్లో దాచిపెట్టిన బంగారాన్ని ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు.

➡️