ఫార్మాలో విషవాయువు లీక్‌

Nov 28,2024 00:29 #accident, #Paravada Pharmacy
  • కార్మికుడు మృతి, ఎనిమిది మందికి అస్వస్థత
  • ఇద్దరి పరిస్థితి విషమం
  • ఠాగూర్‌ పరిశ్రమలో ఘటన
  • బాధితులను ఆలస్యంగా ఆస్పత్రికి తరలించిన యాజమాన్యం
  • ప్రమాదంపై సిఎం చంద్రబాబు ఆరా
  • రూ.కోటి పరిహారమివ్వాలి : సిపిఎం, సిఐటియు

ప్రజాశక్తి- పరవాడ (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా పరవాడలోగల జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలోని ఠాగూర్‌ లేబొరేటరీలో మంగళవారం అర్ధరాత్రి విషవాయువు లీకై ఒక కార్మికుడు మృతి చెందాడు. ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బాధితులను ఆలస్యంగా ఆస్పత్రికి తరలించింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. తోటి కార్మికుల కథనం ప్రకారం… మంగళవారం అర్ధరాత్రి రియాక్టర్‌-కమ్‌-రిసీవర్‌ ట్యాంక్‌ (జిఎల్‌ఆర్‌-325) నుంచి హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ (విషవాయువు) లీకై తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని బుధవారం ఉదయం ఆరు గంటలకు యాజమాన్య ప్రతినిధులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల్లో ఒకరైన ఒడిశాకు చెందిన హెల్పర్‌ అమిత్‌ బాగ్‌ (23) మృతి చెందారు. షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది మందిలో శ్వాస సమస్యతో బాధపడుతున్న సిహెచ్‌ వీరశేఖర్‌, టి.చిన్నికృష్ణల పరిస్థితి విషమంగా ఉంది. రాజేష్‌, పాపారావు, అనిల్‌ కుమార్‌, విజయ భాస్కర్‌, శాంతి కుమార్‌ ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయం బయటకు పొక్కకుండా యాజమాన్యం ప్రయత్నించడం వల్లే ఒక కార్మికుడు మృత్యువాత పడ్డాడని, సకాలంలో చికిత్స అందిస్తే అమిత్‌బాగ్‌ మరణించే వాడు కాదని తోటి కార్మికులు చెబుతున్నారు.

విచారణకు కలెక్టర్‌ ఆదేశం

ప్రమాదంపై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ విచారణకు ఆదేశించారు. విషవాయువు లీకేజీ సమయంలో తొమ్మిది మంది కార్మికులు శ్వాస, దగ్గుతో బాధపడ్డారని తెలిపారు. ప్రమాద పరిస్థితిని సిసి టివి పుటేజీ ద్వారా తెలుసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఫార్మా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుల నుంచి ఫిర్యాదు అందినట్లు కలెక్టర్‌ తెలిపారు.

బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సిఎం

ప్రమాదంలో అస్వస్థతకు గురైన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వారిని ఆదేశించారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్‌పి తుహిన్‌ సిన్హా కలిసి గాజువాకలోని పవన్‌సాయి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి : సిపిఎం, సిఐటియు

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సిపిఎం, సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీలు డిమాండ్‌ చేశాయి. ప్రమాద స్థలాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ సందర్శించారు. ఫార్మా పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కార్మికుల ప్రాణాలు పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాల పట్ల ఉదాసీనంగా ఉండడం వల్లే తరుచూ ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప, ఆ కమిటీల నివేదికలను బహిర్గతం చేసి ప్రమాదాలకు కారణమైన కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.

➡️