Accident – కబళించిన మృత్యువు

  • ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రయివేటు బస్సు
  • ఐదుగురు వలసకూలీలు మృతి
  • సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఘటన

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : పొగమంచు, నిద్రమత్తు కారణంగా బస్సు.. టైర్‌ పంక్చర్‌ అయ్యి రోడ్డు పక్కన ఆగిన లారీని ఢకొీట్టడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఐలాపురం స్టేజీ సమీపంలో హైదరాబాద్‌-ఖమ్మం జాతీయ రహదారి 365పై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒడిశా, బీహార్‌, బెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణలో వివిధ రకాల పనుల నిమిత్తం వందల మంది కార్మికులు ఉపాధి కోసం వస్తుంటారు. ఆ క్రమంలోనే ఒడిశా రాష్ట్రం గుప్తా ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అక్కడి నౌపడ, కలహందీ, నవరంగ్‌పూర్‌, కొరపూట్‌ ప్రాంతాల కూలీలు 32 మంది ఈనెల 9న మధ్యాహ్నం మూడు గంటలకు ఒక ఏజెన్సీ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరారు. ఖమ్మంలో బస్సు డ్రైవర్‌ మరొకరు అందుబాటులో లేకపోవడంతో సునీల్‌ గోరడా అనే వ్యక్తి ఒక్కడే నడుపుతున్నాడు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి కొవ్వూరు నుంచి సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌కు ఇసుక తీసుకెళ్తున్న లారీ సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురంలోని అంగోతు తండా వద్ద రాత్రి సమయంలో టైర్‌ పగలడంతో డ్రైవర్‌ మడెం భాస్కర్‌ హైదరాబాద్‌ రోడ్డు పక్కకు ఆపాడు. ఎలాంటి సిగల్‌ వేయకుండా, బోర్డులు పెట్టకుండా ఆపాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పొగమంచు, నిద్రమత్తు కారణంగా వలస కూలీలతో వచ్చిన బస్సు లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఆ సమయంలో కార్మికులంతా నిద్రలో ఉన్నారు. రెప్పపాటులో కార్మికుల బతుకులు ఛిద్రమయ్యాయి.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరొకరు మృతిచెందారు. 18 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో భార్యాభర్తలైన రూపు హరిజన్‌(51), సుల హరిజన్‌(46), మరో మహిళ సునామని హరిజన్‌(61), బస్సు డ్రైవర్‌ సునీల్‌ గొరడా(37), ప్రత్యుష్‌ ప్రభాత్‌ హరిజన్‌(17) ఉన్నారు. పింటూ బంజారా, రోహిత్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను 108లో సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఒడిశాకు చెందిన తల్వాడ లాభ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మహేశ్వర్‌ వెల్లడించారు.

చెల్లాచెదురు..

ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్మికుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. చేతులు, కాళ్లు విరిగిపోయి రోడ్డు పక్కన పడిపోయాయి. మరణించిన ఓ వ్యక్తి కాలు రోడ్డు పక్కన పడి ఉంది. బస్సు నుజ్జునుజ్జు అయింది.

నిబంధనలు పాటించని ట్రావెల్స్‌ యాజమాన్యం

దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు హెల్పర్లు ఉంటారు. ఒడిశా నుంచి బయలుదేరిన సమయం నుంచి మార్గమధ్యలో ఖమ్మం వద్ద ఒక డ్రైవర్‌, హెల్పర్‌ దిగిపోయి మరొక డ్రైవర్‌, హెల్పర్‌ డ్యూటీ చేయాలి. అలాంటిది ఖమ్మంలో డ్రైవర్‌ ఎక్కకపోవడంతో ఒకే డ్రైవర్‌ బస్సు నడిపాడు. నిద్రమత్తుకు పొగమంచు తోడవ్వడంతో ఐదుగురు ప్రాణం కోల్పోయారని తోటి కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మంలో డ్రైవర్‌ మారితే ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఉండేది కాదని బస్సులో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్‌పి సన్‌ ప్రీత్‌ సింగ్‌

ఘటనాస్థలాన్ని ఎస్‌పి సన్‌ప్రీత్‌ సింగ్‌ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసి జాతీయ రహదారిపై లారీలు, ఇతర వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఎస్‌పి రవి, రూరల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ మహేశ్వర్‌, సిబ్బంది ప్రమాదానికి గురైన వాహనాలను భారీ క్రెన్‌ సాయంతో పక్కకు జరిపించారు.

బైక్‌ను ఢీకొట్టిన లారీ..

నర్సాపూర్‌ : బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శివంపేట్‌ మండలం అల్లిపూర్‌ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్‌(26), అతని స్నేహితుడు నాగరాజు(25) కొంపల్లి వెళ్లి వస్తున్న క్రమంలో నర్సాపూర్‌ ఎన్జీవోస్‌ కాలనీ వద్ద హైదరాబాద్‌ నుంచి వస్తున్న లారీ బైకును బలంగా ఢకొీట్టింది. దీంతో అల్లీపూర్‌ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్‌, నాగరాజు అక్కడికక్కడే మృతిచెందారు. దుర్గాప్రసాద్‌కు భార్య, కూతురు, నాగరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు.\

 

➡️