ప్రజాశక్తి-బాపట్ల : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరు మీద బాపట్ల పట్టణం శ్రీనివాస్‌నగర్ కాలనీలో ఉన్న తొమ్మిదిన్నర సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి భూమిని కొట్టేసిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాపట్ల డిఎస్‌పి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బాపట్ల పట్టణంలో శ్రీనివాసనగర్ కాలనీలో సర్వే నెంబరు 969/1 గల సుమారు 9.5 సెంట్ల భూమిని బాపట్లకు చెందిన మువ్వా సుబ్బారావు కుమారుడు హరీష్‌కు తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో వాళ్ల పూర్వీకులకు చెందిన భూమిని టిడిపి భవన నిర్మాణం కోసం విరాళంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరు మీద సర్వే నెంబరు 2911/2000 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. 2011లో ఈ భూమిని ఫోర్జరీ సంతకాలతో బాపట్ల పట్టణ వెంగల్ విహార్‌కు చెందిన నిర్మలాదేవికి ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. అనంతరం ఆమె తన కుమారుడుకి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయంపై అప్పటి ఎమ్మార్వో వైఎస్ వికెజిఎస్‌ఎల్.సత్యనారాయణరావు బాపట్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిర్మలాదేవి, ఆమె కుమారుడు సతీష్, వీరికి సహకరించిన యోహాన్, సాక్షులుగా ఉన్న జోగి సత్యానందం, గుజ్జర్లపూడి యోసోబు, డాక్యుమెంట్ తయారు చేసిన రైటర్ నందనం నరసింహారావును పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు పంపారు. అయినప్పటికీ నకిలీ దస్తావేజులను అసలు దస్తావేజులుగా చూపిస్తూ.. సుమారు ఏడు అక్రమ రిజిస్ట్రేషన్‌లకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసులు గుర్తించి.. అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బాపట్ల పట్టణం వెంగళ విహార్‌కి చెందిన కారుమూరి సత్య వేదం, యాదవపాలెంకు చెందిన బుడ్డి శ్రీనివాసరావు, చీరాల ఉడ్‌నగర్‌కు చెందిన నక్కల శ్రీనివాసులు, నక్కల లలిత, చీరాల మండలం, కావూరువారిపాలెంకు చెందిన కోటా శివారెడ్డి, చీరాల మండలం, గవినివారిపాలెంకు చెందిన వుప్పాల కోటేశ్వరరావు, బాపట్ల మండలం, కొత్త వాడరేవుకు చెందిన నక్కల సత్తార్‌రెడ్డి, బాపట్ల పట్టణం, ఉప్పరపాలెంకు చెందిన నందనం నరసింహారావును అరెస్టు చేసి.. రిమాండ్‌కు పంపినట్లు డిఎస్‌పి తెలిపారు. నిందితుల వద్ద నుండి అక్రమ రిజిస్ట్రేషన్లకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
