- రెండో రోజూ కొనసాగిన కార్మికుల ఆందోళన
ప్రజాశక్తి – అచ్యుతాపురం (అనకాపల్లి) : అభిజిత్ ఫెర్రో టెక్ పరిశ్రమను మూసివేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కార్మికులు రెండో రోజైన మంగళవారమూ ఆందోళన కొనసాగించారు. తొలుత కంపెనీ ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ఎపిఐఐసి జోనల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జోనల్ మేనేజర్ కె హరిప్రసాద్‌రావుకు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను తెలియజేశారు. కార్మికుల ఆందోళనను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు చెప్పకుండా చట్ట వ్యతిరేకంగా అక్రమంగా లే ఆఫ్ ప్రకటించడం అన్యాయమన్నారు. అభిజిత్ యాజమాన్యం ఏనాడూ కార్మిక చట్టాలను అమలు చేయలేదన్నారు.
కనీస వేతనాలు ఇవ్వకపోయినా, ఇతర సౌకర్యాలు కల్పించకపోయినా కార్మికులు పనిచేస్తూ వచ్చారన్నారు. ఎస్‌ఇజెడ్‌లోని మైతాన్, సుందరం ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీల కంటే అభిజిత్‌లో పనిచేస్తున్న కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. గతంలో ఆందోళన చేసినప్పుడు డస్ట్ అలవెన్స్, హీట్ అలవెన్స్ ఇస్తామని అంగీకరించి నేటి వరకు అమలు చేయకుండా యాజమాన్యం మాట తప్పిందన్నారు. ప్రతినెలా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని, ఈ ఏడాది దసరా బోనస్ కూడా ఇవ్వలేదని తెలిపారు. కోవిడ్ కాలంలో డ్యూటీకి రాలేని పరిస్థితుల్లోనూ ఈ కంపెనీలో కార్మికులతో బలవంతంగా పని చేయించుకున్నారని గుర్తుచేశారు. కంపెనీ కార్మికులను తొలగించినప్పటికీ కూటమి ప్రభుత్వం నోరు మెదపకుండా ప్రేక్షక పాత్ర వహించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. యాజమాన్యం, ప్రభుత్వం తీరుతో నేడు వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వెంటనే యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు. ఐక్య పోరాటాలతో సమస్యను పరిష్కరించుకోవాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, మండల కన్వీనర్ కె సోమునాయుడు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు పాల్గొన్నారు.