- ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం, వెల్లటూరు గ్రామంలో బాణావత్ పార్వతి (45) ఆత్మహత్యకు కారణమైన హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ‘ఫైవ్ స్టార్’పై చర్యలు తీసుకోవాలని, దౌర్జన్యానికి పాల్పడిన ఆ సంస్థ ఏజంట్లను అరెస్ట్ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశాయి. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు పార్వతి ఇంటికి తాళం వేయడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు ధరల భారం మోపడంతో ప్రజలు అధిక వడ్డీల వలలో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫైవ్ స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ దౌర్జన్యానికి బలైన గిరిజన మహిళ పార్వతి బాయి కుటుంబానికి, ఆ సంస్థ నుంచి రూ.25 లక్షల నష్టపరిహారం, రెండెకరాల భూమి ఇప్పించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దారుణానికి ప్రభుత్వం బాధ్యత వహించి పార్వతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు, పేదలకు, కౌలుదారులకు ప్రభుత్వ బ్యాంక్‌లు రణాలు మంజూరు చేయనందునే ఇలాంటి కంపెనీలకు పేదలు బలైపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ సంస్థ ఆగడాలను అడ్డుకోకపోతే ఈ నెల 20 తరువాత రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.