పిఆర్‌సి, గ్రాట్యూటీ బకాయిల చెల్లింపునకు చర్యలు

Nov 29,2024 07:09 #APSRTC, #APSRTC employees, #SWF

పిటిడి కమిషనర్‌ను కోరిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్‌టిసి ఉద్యోగులకు పిఆర్‌సి, గ్రాట్యూటీలోని బకాయిలను చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) కోరింది. ఈ మేరకు ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎస్‌కె జిలాని బాషా, ప్రచార కార్యదర్శి టిపిఆర్‌ దొర పిటిడి కమిషనర్‌కు వినతిపత్రాన్ని గురువారం అందజేశారు. ఆర్‌టిసి ఉద్యోగుల్లో ఎంప్లాయి పెన్షన్‌ స్కీంను ఎంపిక చేసుకున్న వారికి 2020, జనవరి 1 నుంచి ఆర్‌టిసి గ్రాట్యూటీ ఫార్ములా ప్రకారం గ్రాట్యూటీ చెల్లింపులు జరగాలని, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌లో 300 ఎర్నెడ్‌ లీవులు లేనివారికి అకౌంట్‌లోని అర్ధవేతనపు సెలవులు లెక్కించి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు చెప్పారు. ఇప్పటికీ అనేక డిపోల్లో గ్రాట్యూటీ చెల్లింపుల్లో రూ.16 లక్షలు సీలింగ్‌తో చెల్లింపులు జరిగాయని, కొందరికి రూ.12 లక్షలు మాత్రమే చెల్లించారని చెప్పారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఏలూరు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నరసాపురం వంటి డిపోల్లో ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తులను ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు. అర్హులైన వారికి పిఆర్‌సి 2022, గ్రాట్యూటీ వేతన బకాయిల చెల్లింపులు జరిగేలా ఉత్తర్వులివ్వాలని కమిషనర్‌ను కోరారు.

➡️