సిఐటియు నాయకులపై ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిందులు

ప్రజాశక్తి – అనంతపురం : సిఐటియు నాయకులపై ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి చిందులు తొక్కారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఉన్న విజయప్రతాప్‌రెడ్డిని బుధవారం సాయంత్రం సిఐటియు నాయకులు కలిసేందుకు వెళ్లారు. అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. సమస్యలు పరిష్కరించే విషయం తన పరిధిలో లేదని.. మీరిలా వచ్చి ఎందుకు తన పనులకు ఆటంకం కలిగిస్తారంటూ చిందులు తొక్కారు. చైర్మన్‌ తీరును శ్రీ సత్యసాయి జిల్లా సిఐటియు నాయకులు హరి, రమేష్‌, మహబూబ్‌ బాషా తదితరులు తప్పుబట్టారు.
అంతకుముందు అనంతపురం నగరంలోని ఎస్‌కెడి ప్రైమరీ స్కూల్‌ పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్‌ను పరిశీలించారు. రాప్తాడు కెజిబివిని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. పాఠశాలలు, కెజిబివిలు, హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని, నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం తదితర వాటిపై అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మతో విజయప్రతాప్‌రెడ్డి చర్చించారు.

➡️