అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలి : సిపిఎం

ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అప్పజెప్పాలని విశాఖపట్నం గాజువాకలోని పెదగంట్యాడ జంక్షన్‌లో సిపిఎం ఆధ్వర్యాన బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ అదానీ పోర్టు బిల్డ్‌ ఆపరేటర్‌ ట్రాన్స్‌పోర్టు పద్ధతిలో నిర్మాణం చేపట్టారని, దాని నిర్మాణం కోసం 3000 ఎకరాల భూమిని తీసుకున్నారని తెలిపారు. ఈ నిర్మాణం వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఆ మూడు వేల ఎకరాల్లో వెయ్యి ఎకరాలు భూమి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిందని పేర్కొన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఉండేదని, 2033 వరకు ఒప్పందం ఉంటుండగానే గత వైసిపి ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కలిపి అదానీకి విక్రయించేశాయని తెలిపారు. ఈ పోర్టును రాష్ట్ర ప్రభుతం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అదానీ పక్కలో బల్లెంలా తయారయ్యారని అన్నారు. ఇటీవల పోర్టులో జరిగిన సమ్మెలో కావాలనే యాజమాన్యం కాలయాపన చేయడం వల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ. మూడు వేల కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. అదానీ కుట్ర వల్ల ఈ నష్టాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ పోర్టుకు వచ్చే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ముడి సరుకుకు దిగుమతి ఛార్జీలు విపరీతంగా పెంచేసి నష్టం కలిగిస్తున్నారన్నారు. సోలార్‌ విద్యుత్‌కు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని, అదానీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఆ భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నందున జగన్‌ను, అదానిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేసిన స్మార్ట్‌ మీటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ ధర్నాలో సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి గంగారావు, సిపిఎం నాయకులు నమ్మి రమణ, జి శ్రీనివాసరావు, కణితి అప్పలరాజు, కొవిరి అప్పలరాజు, బైరెడ్డి గుర్రప్ప, ఎన్‌ రామారావు, కార్మికులు పాల్గొన్నారు.

➡️