- ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలి
- ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన
ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని చిత్రావతి ప్రాజెక్ట్ మీద నిర్మిస్తున్న అదాని 500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ హైడ్రో పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్‌తో సమీప గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు అన్నారు. అదాని హైడ్రో ప్రాజెక్టు వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ తాడిమర్రి మండలం పెద్దకొట్ల, చిల్లకొండాయపల్లి గ్రామాల సమీపంలో అదాని సంస్థ నిత్యం పెద్ద ఎత్తున బ్లాస్టింగులు చేస్తుండడంతో పొలాలు దెబ్బతింటున్నాయని, దీంతో భూమి పొరలు దెబ్బతిని భూగర్భ జలాలు అడుగంటుకుంటున్నాయని తెలిపారు. ఏడాది క్రితం వరకు పుష్కలంగా ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు అడగంటి బోర్లన్నీ ఎండిపోతున్నాయన్నారు. తమ పంట పొలాలన్నీ నాశనం అవుతున్నాయని గత మూడు నెలలుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అదాని సిబ్బంది పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ సమస్యను పరిశీలించేందుకు అధికారులు అదాని పరిశ్రమ వద్దకు వెళ్తే వారిని లోపలికి అనుమతించడంలేదన్నారు. అదాని పరిశ్రమ చుట్టూ ఉన్న దాడితోట, చిల్లకొండాయపల్లి, పెద్దకోట్ల, గ్రామాల పరిధిలో అరటి, చీనీ, దానిమ్మ, టమోటా, మిరప తోటలన్నీ ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ టిఎస్ చేతన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు, హరి, మారుతి, కౌలు సంఘం అధ్యక్షుడు కదిరప్ప, చలపతి, సిఐటియు నాయకులు పైపల్లి గంగాధర్, రైతులు పాల్గొన్నారు.