అదాని, అంబానిల నుండి అడవిని కాపాడుకోవాలి

  • రంపచోడవరం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి 
  • పోలవరం నిర్వాసితుల ఉద్యమం ఉధృతం
  •  జిఓ 3 పునరుద్ధరణ, అటవీ హక్కుల రక్షణకు పోరాటాలు 
  • సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రథమ మహాసభలో వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- రాజవొమ్మంగి, రంపచోడవరం విలేకరులు : రంపచోడవరం కేంద్రంగా ప్రభుత్వం ప్రత్యేక జిల్లాను ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అదాని, అంబానిల బారి నుంచి అడవులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీలో గిరిజనుల హక్కులు, చట్టాలు పటిష్ట అమలుకు అల్లూరి స్ఫూర్తితో పోరాడాలని, లేనిపక్షంలో ఏజెన్సీ వాసులను పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదని తెలిపారు. కార్పొరేట్ల లబ్ధి కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్నారు. రెండు రోజులపాటు జరగనున్న సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రథమ మహాసభ రంపచోడవరం వేదికగా సోమవారం ప్రారంభమైంది. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ మీదుగా భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, ఆదివాసీలతో ఈ ర్యాలీ ఉత్తేజంగా సాగింది. కళారూపాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం రంప రోడ్డులో పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివాసీ పోరాటాల పురిటిగడ్డ రంపచోడవరంలో జరుగుతున్న ఈ మహాసభకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరే… మునిగిపోతున్న లక్ష కుటుంబాల మాటేంటని ప్రశ్నించారు. పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మాణం జరగాలని చట్టాలు చెబుతున్నాయన్నారు ఇప్పటి వరకూ పది శాతమే పునరావాసం జరిగిందని, మిగిలిన 90 శాతం పరిస్థితి ఏమిటో పాలకులు చెప్పడం లేదన్నారు. పునరావాసం, పరిహారం కల్పించాలని, 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వాలని, పోడు భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాల్లో ఆదివాసీలకు అన్యాయం చేస్తుండడం తగదన్నారు. గడిచిన మూడేళ్లలో నిర్వాసితుల సమస్యలపై చేసిన పోరాటాలను గుర్తు చేశారు. జిఓ నెంబర్‌ 3 పునరుద్ధరణకు, 1/70 చట్టం, పీసా చట్టం అమలుకు ఉద్యమించామన్నారు. ఏజెన్సీలో పటిష్టమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయల కల్పన, పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా సిపిఎం పనిచేస్తోందని వివరించారు. రాజ్యాంగంలోని అంశాలను, ఐదో షెడ్యూల్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయన్నారు. గతంలో వామపక్ష పార్టీల ఒత్తిడితో తీసుకొచ్చిన చట్టాలను నేటి పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సనాతన ధర్మం కోసం కొందరు మాట్లాడుతున్నారని, ఏజెన్సీ గురించి అటువంటివారు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొడుతున్నారన్నారు. అదాని అవినీతిపై పార్లమెంట్‌లో ప్రతిపక్షం నిలదీస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని తెలిపారు. దేశంలో మైనార్టీలపై రోజురోజుకూ దాడులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఏజెన్సీలో అడుగు పెట్టకుండా చూడాలన్నారు. లేనిపక్షంలో ఏజెన్సీ మరో మణిపూర్‌ అవుతుందన్నారు. ఏజెన్సీలోని స్కీం వర్కర్లను, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్లను, ఉద్యోగ, ఉపాధ్యాయులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపడం దారుణమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు, కిల్లో సురేంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు సహజ వనరులను దోచిపెడుతోందన్నారు. దేశంలో మహిళలకు భద్రత కరువైందని తెలిపారు. వేదికపై పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు, ఎం.వాణిశ్రీ, ఎం.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. అనంతరం ఆర్‌పి ఫంక్షన్‌ హాలులో పూనెం సత్యనారాయణ నగర్‌, సీతారాం ఏచూరి ప్రాంగణంలో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. లోతా రామారావు, సీసం సురేష్‌, కాకా అర్జున్‌, కారం లక్ష్మి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.

➡️