ఎన్‌టిపిసిలోకి అదానీ ప్రవేశం ప్రమాదకరం

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో, అనకాపల్లి విలేకరి : ‘ఎన్‌టిపిసిలోకి అడ్డుగోలుగా అదానీ’ శీర్షికతో గురువారం ప్రజాశక్తిలో ప్రచురితమైన పరిశోధనాత్మక కథనంపై ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. పరవాడ ఎన్‌టిపిసి, చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ చూసినా అదానీ వ్యవహారంపైనే మాట్లాడుకోవడం కనిపించింది. కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ సహా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకులు, ఉత్తరాంధ్ర చర్చా వేదిక నాయకులు ఈ అంశంపై స్పందించారు. ఎన్‌టిపిసిలోకి అదానీ ప్రవేశం ప్రమాదకరమని వారంతా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చేస్తారా ? అని మండిపడ్డారు.

విస్మయపరిచింది
ఎన్‌టిపిసికి బొగ్గు సరఫరా కాంట్రాక్ట్‌ అదానీ గ్రూపునకే ఇస్తారన్న విషయం జిల్లా వాసులను విస్మయపరిచింది. ఇప్పటికే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులైన అదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేస్తోంది. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా తన పోకడలను మార్చుకోవాలి. పాలకులు అదానీ సంస్థల ఏజెంట్లుగా వ్యవహరించడం సమంజసం కాదు.
– మీసాల సుబ్బన్న, కాంగ్రెస్‌ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు

సిఎం, డిప్యూటీ సిఎం స్పందించాలి
ఎన్‌టిపిసిలోకి అదానీ అడ్డగోలుగా ప్రవేశించడంపై సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించాలి. ఎన్‌టిపిసి యాజమాన్యం కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగకుండా పాత కాంట్రాక్టర్‌ను కొనసాగించాలి. తాజా వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ స్పందించి యాజమాన్యానికి, కాంట్రాక్టర్‌కు రక్షణ కల్పించాలి.
– బుద్ధ రాజేష్‌, ఉత్తరాంధ్ర చర్చా వేదిక నాయకులు.

అదానీ రాకతో నష్టం
అదానీ రాకతో చిన్నాచితకా కాంట్రాక్టర్లతో పాటు విశాఖ పోర్టుకు కూడా ప్రమాదం. ఆంధ్రప్రదేశ్‌ క్రమేపీ అదానీ గుప్పెట్లోకి పోతోంది. పార్లమెంటు పరిధిలో ఇటువంటి నాయకులపై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలి. అదానీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను టిడిపి కూటమి ప్రభుత్వం తీసుకోవాలి.
– వైఎన్‌.భద్రం, సిపిఐ అనకాపల్లి జిల్లా నాయకులు

అడ్డగోలు కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్‌ని అదానీ రాష్ట్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా అడ్డగోలు కేటాయింపులు చేస్తున్నారు. అందులో భాగంగా కీలకమైన ఎన్‌టిపిసికి బొగ్గు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చి అదానీకి దొంగ చాటున కాంట్రాక్టు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేంద్ర బిజెపి, ఎపిలోని కూటమి ప్రభత్వుం, అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు సిఎం.రమేష్‌ ఆశీస్సులతో జరుగుతోంది. దీనివల్ల ఎన్‌టిపిసి మనుగడకే ప్రమాదం.
– కె.లోకనాథం, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి

దేశంలో వనరులన్నింటినీ అదానీ పరం చేస్తున్న ఎన్‌డిఎ

దేశంలోని వనరులన్నింటినీ ఒక్కొక్కటిగా కార్పొరేట్‌ అదానీ పరం చేయడానికి ఎన్‌డిఎ కూటమి ప్రయత్నిస్తోంది. ఎన్‌టిపిసికి ఒడిశా బొగ్గు గనుల నుంచి తాల్చేరు పోర్టు ద్వారా షిప్పులలోగానీ, రైలు రవాణాలోగానీ ప్రతిరోజూ పరవాడలోని థర్మల్‌ ప్లాంట్‌కు వస్తుంది. గతం నుంచీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు బొగ్గును విశాఖ, గంగవరం పోర్టుల నుంచి పవర్‌ స్టేషన్‌కు రవాణా చేసేవారు. ఎన్‌డిఎ ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అదానీమయం అవ్వడం చూస్తున్నాం. ఇప్పటికే గంగవరం పోర్టు అదానీ పరమైంది. ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీల నుంచి వచ్చే బొగ్గు బదులు విదేశీ గనుల నుంచి అత్యధిక ధరలకు బొగ్గును కొనాలని కేంద్రం ఆదేశించడంతో ఎన్‌టిపిసి వంటి ప్లాంట్‌లు అదానీ యాజమాన్యంలో ఉన్న విదేశీ బొగ్గు గనుల నుంచి కొనే దైన్య పరిస్థితి ఏర్పడింది. చిన్న కాంట్రాక్టర్లను కూడా వదలకుండా వారి కాంట్రాక్టులను కూడా అదానీ లాగేసుకోవడం బాధాకరం.
– ఇఎఎస్‌.శర్మ, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి

➡️