కావాల్సినంత మద్యం సరఫరా

Jan 10,2025 21:33 #Adequate, #alcohol, #supply
  • ఎక్సైజ్‌ అధికారులు నిశాంత్‌కుమార్‌, రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్రాంతి పండగ సందర్భంగా అక్రమ మద్యంపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్‌ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. డిప్యూటీ, అసిస్టెంట్‌ కమిషనర్లతో శుక్రవారం వారు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను భాగస్వామ్యం చేసి భద్రతా చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్లు ఎపిఎస్‌బిసిఎల్‌ డిపోలను తనిఖీచేసి లైసెన్సీలకు ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ (ఐఎంఎల్‌), బీరు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. దీనిపై 24 గంటలూ పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అవసరమైన చోటకు సరుకును వేగంగా చేరవేసేలా చూడాలన్నారు. నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీని అడ్డుకోవాలని ఆదేశించారు. నకిలీ మద్యం, కల్తీ తాటికల్లు విక్రయాలను అడ్డుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాటికల్లుకు నిరంతరం శాంపిల్‌ టెస్టులు చేయాలని సూచించారు. సరిహద్దుల్లో మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీలు, ఎక్సైజ్‌ చెక్‌ పోస్టులు పూర్తిస్థాయిలో ప్రారంభించి ఆపరేషన్లను ముమ్మరం చేయాలని, పొరుగు రాష్ట్రాల నుండి పన్ను చెల్లించకుండా తెచ్చే మద్యాన్ని నివారించాలని ఆదేశించారు. పండగ సమయాల్లో ఎన్‌డిపిఎస్‌ పదార్థాల వినియోగం, పంపిణీపై గట్టి పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

➡️