ఆదివాసులకు అశనిపాతం : ఆదివాసీ గిరిజన సంఘం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు కమిటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లోత రాంబాబు, కిల్లో సురేంద్ర శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వికసిత్‌ భారత్‌ అని అంటూ ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం గిరిజనులను మరింత పేదరికంలోకి నెట్టే విధంగా బడ్జెట్‌ కేటాయింపులు చేసిందన్నారు. దేశం మొత్తం బడ్జెట్‌ కేటాయింపులు రూ.50,65,345 కోట్లు కాగా, దేశంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగ బద్ధంగా 8.8 శాతం ప్రకారం గిరిజన సబ్‌ప్లాన్‌కు రూ.3,54,574 కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.1,29,249 కోట్లు కేటాయించి గిరిజనులకు తీరని అన్యాయం చేసిందన్నారు. గిరిజనుల అభివృద్ధికి నేరుగా ఉపయోగపడే రంగాల్లో కేటాయింపులు పూర్తిగా తగ్గించి కార్పొరేట్లు, బడా కాంట్రాక్టర్లు, ధనవంతుల ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చే రంగాల్లో మాత్రం గణనీయమైన కేటాయింపులు చేసిందన్నారు. ఉన్నత విద్యలో గిరిజన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతేడాది రూ.240 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కేవలం రూ.2 కోట్లు కేటాయించడం దారుణమన్నారు.

➡️