మెగా డిఎస్‌సిలో ఆదివాసీలకు న్యాయం చేయాలి

Jun 30,2024 20:45 #Adivasis, #given justice, #Mega DSC

– ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్‌
ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్‌సిలో ఆదివాసీలకు న్యాయం చేయాలని, ఆదివాసీ డిఎస్‌సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, మెటీరియల్‌ పంపిణీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్‌ చేసింది. జిఒ 3కి చట్టబద్ధత కల్పించి గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌కు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోతా రామారావు, కిల్లో సురేంద్ర, అల్లూరి జిల్లా నాయకులు ఎస్‌ ధర్మన్న పడాల్‌, పి బాలదేవ్‌ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. ఏజెన్సీలో ఏకలవ్య గురుకుల పాఠశాల, కళాశాల సీట్లు కోసం 2500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఈ నేపథ్యంలో సరిపడా సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా గురుకుల పాఠశాల, కళాశాలలను ఏర్పాటు చేయాలన్నారు. పివిటిజిలకు ప్రత్యేక పాఠశాల, కళాశాల నెలకొల్పాలని కోరారు. జనరల్‌ డిఎస్‌సికి సన్నద్ధమవుతున్న వారికి అరకు, పాడేరు, చింతపల్లి కేంద్రాల్లో ఉచిత కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలో వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామాల్లో దోమల నియంత్రణకు మందును పిచికారీ చేయించాలని, మలేరియా నివారణ చర్యల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వర్కర్లను నియమించాలన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఉచిత కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

➡️