- ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగభృతిపై చర్చకు వైసిపి పట్టు
- ఛైర్మన్ తిరస్కరించడంతో ఆందోళన
- పలుమార్లు వాయిదా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి పథకంపై చర్చించాలని కోరుతూ వైసిపి సభ్యులు శాసనమండలిలో పట్టుబట్టారు. దీనికి ఛైర్మన్ కె మోషేనురాజు తిరస్కరించడంతో ఆందోళనకు దిగారు. దీంతో మూడుసార్లు మండలి వాయిదా పడింది. ఆ తరువాత ప్రారంభమైన సభలో కూడా వైసిపి సభ్యుల ఆందోళన కొనసాగుతుండటంతో ఛైర్మన్ ఆదేశాలతో మార్షల్స్ మండలిలోకి ప్రవేశించారు. దీంతో వైసిపి సభ్యులు వాకౌట్ చేశారు. బుధవారం సభ ప్రారంభంకాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి పథకంపై చర్చించాలని చైర్మన్ కె మోషేను రాజుకు వైసిపి సభ్యులు టి మాధవరావు తదితరులు వాయిదా తీర్మానం అందించారు. దీనిని తిరస్కరిస్తునట్లు చైర్మన్ ప్రకటించడంతో ఈ అంశంపై చర్చించాలని వైసిపి సభ్యులు వారి స్థానాల నుంచి చైర్మన్ పోడియం ముందుకొచ్చి ఆందోళన చేశారు. వారు ఆందోళన చేస్తున్న సమయంలోనే చైర్మన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వమే బకాయిలు పెట్టి, వారే ధర్నాలు చేస్తున్నారని అన్నారు. బకాయిలు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. విద్యారంగంపై స్వల్పకాలిక చర్చ ఉందని, ఆ సమయంలో వీటిపై చర్చిద్దామన్నారు. సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ప్రారంభమైన 15 నిమిషాల తరువాత సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా వైసిపి సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. వారి ఆందోళనల మధ్యలోనే చైర్మన్ ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. ప్లకార్డులతో వైసిపి సభ్యులు చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో మరోసారి సభ వాయిదా పడింది. మూడోసారి సభ ప్రారంభమైన తరువాత కూడా వైసిపి సభ్యులు ఆందోళన కొనసాగిస్తుండటంతో చైర్మన్ ప్రశ్నోత్తరాలు పూర్తిచేసి సభను వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాకముందే మార్షల్స్ లోపలికి వచ్చి చైర్మన్ పోడియం వైపు ఎవరూ వెళ్లకుండా ఇరువైపులా అడ్డుగా నిలబడ్డారు. అయినా మార్షల్స్‌ను నెట్టుకొని చైర్మన్ పోడియం వైపు వెళ్లేందుకు వైసిపి సభ్యులు అరుణ్‌కుమార్, రమేష్ యాదవ్, మాధవరావు, కాంట్రాక్టర్ భాషా, రుహుల్లా తదితరులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో మార్షల్స్‌కు వైసిపి సభ్యులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మార్షల్స్‌ను ప్రవేశపెట్టడం దురదృష్టకరమని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మార్షల్స్‌ను ఎలా ఉపయోగించారో తెలుసుకోవాలని బొత్సకు చెప్పారు. ఈ చర్యకు నిరసనగా తాము సభనుంచి వాకౌట్ చేస్తునట్లు బొత్సతో పాటు వైసిపి సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లారు.