పాఠశాలలను దత్తత తీసుకోండి

  • ఎంఎల్‌ఏలకు లోకేష్‌ సూచన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ ప్రాంతంలోని పాఠశాలలను ఎంఎల్‌ఏలు దత్తత తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష సూచించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు ఆయన జవాబిస్తూ పాఠశాలలను దత్తత తీసుకోవడం, సిఎస్‌ఆర్‌ నిధులు, ఇతర కార్యక్రమాలతో నిధులు సమకూర్చుకుని పాఠశాలలను అభివృద్ధి చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 5 స్టార్‌ రేటింగ్‌ స్థాయికి తీసుకురావడానికి రూ.13,524 కోట్లు అవసరమని, ఇది ఒకే సారి చేయడం సాధ్యమయ్యే పని కాదన్నారు. రాష్ట్రంలోని 44,292 పాఠశాలల్లో 5 స్టార్‌ రేటింగ్‌ పాఠశాలలు ఒక్కటి కూడా లేవని, 4 స్టార్‌ రేటింగ్‌లో 6,700, 3 స్టార్‌ రేటింగ్‌లో 19,131, 2 స్టార్‌ రేటింగ్‌లో 16,416, 1 స్టార్‌లో 1,958, 0 స్టార్‌ రేటింగ్‌లో 87 పాఠశాలలు ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రాచీన పత్ర భాండాగారం నుంచి అధికారిక పత్రాలు, శాసనాలు, రికార్డులు రాష్ట్రానికి రప్పించే విషయమై సభ్యులడిన ప్రశ్నకు సమాధానమిస్తూ…1769 నుంచి 1953 వరకూ రికార్డులు అన్ని వచ్చాయని, 15 కేలగిరిల రికార్డులకు గాను 7 కేలగిరిలు ఇచ్చినట్లు చెప్పారు.

జూన్‌కు హంద్రీ నీవా పనులు

హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి నిలిచిపోయిన పనులు జూన్‌ నాటికి పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో ఈ పథకం పరిధిలో ఉన్న అన్ని చెరువులు నింపుతామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనికోసం రూ.3,040 కోట్లు కేటాయించినట్లు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తెలుగుగంగ ప్రాజెక్టులో 13 నుంచి 37వ బ్లాక్‌ వరకూ జివిపిఆర్‌ ఇంజనీరింగ్‌ సంస్థకు పనులు కేటాయించడగా 73 శాతం మాత్రమే పూర్తి చేసి ఫ్రీకోజ్‌ చేసిందని మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పుత్తూరు మున్సిపాలిటీలో రూ.54.60 లక్షల పనుల్లో రూ.45.82 లక్షల విలువైన పనులు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండానే పూర్తి చేశారనిఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డ్రైన్ల నిర్మాణం, తక్కు విక్రయం వంటి విషయాల్లోను నిబంధనలు పాటించలేదని దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. దొనకొండ ప్రాంతంలో 11 వేల ఎకరాల్లో రెండు అల్ట్రా మెగా సోలార్‌ పార్కులు ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సభ్యులకు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వృద్ధాశ్రమాలు మచిలీపట్నం, చిత్తూరులో నిర్వహిస్తున్నట్లు వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. మరో 12 వృద్ధాశ్రమాలను రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు.

➡️