- కానూరు అగ్రహారంలో రెడ్ జోన్
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : కోళ్లు మృత్యువాతకు బర్డ్‌ఫ్లూ వైరస్ కారణమని ధ్రువీకరణ అయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో 15 రోజులుగా అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల నమూనాలను పూణేలో ల్యాబ్‌కు పంపించారు. ఈ వైరస్ బర్డ్ ఫ్లూగా నిర్ధారిస్తూ ల్యాబ్ నివేదికను సోమవారం పంపించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని గుర్తించిన పౌల్ట్రీకి ఒక కిలో మీటర్ పరిధిలో రెడ్ జోన్‌గా, మరో పది కిలో మీటర్ల వరకూ సర్వేలైన్స్ జోన్‌గా ప్రకటించారు. జిల్లాలో అనపర్తి, బిక్కవోలు, పెరవలి, ఉండ్రాజవరం, రాజానగరం, రంగంపేట మండలాల్లో అధికంగా పౌల్ట్రీలు ఉన్నాయి. గతేడాది డిసెంబరు నుంచి వైరస్ కారణంగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల 15 రోజులుగా సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లాలోని పౌల్ట్రీల్లో 2.13 కోట్ల కోళ్లు ఉంటే రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 60 లక్షల నుంచి 65 లక్షల గుడ్లు వస్తున్నాయి. గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు 20 లారీల గుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 10 నుంచి 12 లారీలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. బర్డ్ ఫ్లూగా నిర్ధారణ కావడంతో వైరస్ ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి పశుసంవర్థక శాఖ జెడి శ్రీనివాసరావు తెలిపారు.