- దళితులకు అత్యున్నత విద్య అందించడమే లక్ష్యం
- రెసిడెన్షియల్ స్కూళ్లు పెంపు
- పొన్నెకల్లు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని త్వరలో పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో సోమవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు, పి-4 సాధికారిక సభలో ఆయన ప్రసంగించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు తాము గతంలో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేశామన్నారు. గత ప్రభుత్వం పేరు మార్చి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తిరిగి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్‌సి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
అంబేద్కర్ అందరివారు
గత ప్రభుత్వం కక్షపూరితంగా అమరావతిని నాశనం చేశారని, ప్రజల ఆశీస్సులతో ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని తాము తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. రాజధానిలో రైతులకు, వ్యవసాయ కార్మికులకు న్యాయం చేస్తామని తెలిపారు. అంబేద్కర్ అందరి వాడని, ఆయన కూడా బరోడా రాజు ఇచ్చిన చేయూతతో ఉన్నత స్థాయికి వచ్చారని ఇదే స్పూర్తితో తాను పి-4 విధానం తీసుకొచ్చి పేదలను ఆదుకునేందుకు పది శాతం ధనికులు ముందుకు రావాలని పిలుపునిస్తే వారి నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి రూ.20,221 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. ఎస్‌సి, ఎస్‌టిలను విద్యుత్ ఛార్జీల భారం నుంచి బయటపడేసేందుకు వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,241 ఎస్‌సి సంక్షేమ హాస్టళ్లలో 2,35,600 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి రూ.1,331 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరిం చారు. రాష్ట్రంలో 21 లక్షల పేద ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలున్నాయని తెలిపారు. వారి కోసం 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఎస్‌సిలు వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 200 యూనిట్లు వాడుకుని మిగిలిన దానిని ప్రభుత్వానికి ఇస్తే యూనిట్‌కు రూ.2.09 చొప్పున ఇస్తామన్నారు. నెలకు వంద యూనిట్లు ఇస్తే రూ.209 ఎస్‌సిల ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.50 వేలు అదనంగా ఇస్తామన్నారు.
విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడిన చంద్రబాబు
టిడిపి హయాంలో ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించి నేడు మంచి ఉద్యోగం చేస్తున్న వారితో ప్రజావేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా మాట్లాడారు. ఆస్ట్రేలియాలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొరివి రత్నలత, కెనాడాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్‌తో మాట్లాడుతూ ‘మీరు కూడా కొంతమంది పేదలను దత్తత తీసుకుని వారిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి’ అని కోరారు.
పి-4పై విమర్శలు తగవు
పి-4పై తెలియని వారు ఏదో మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ధనికులు పేదలను ఆదుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని, దీనిపై ఏదేదో మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలా మాట్లాడేవారు వారి జీవితంలో ఒక్క కుటుంబాన్ని అయినా బాగు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. అనంతరం ప్రజావేదిక సభలో బంగారు కుటుంబాలకు ఎంపికైన వారి సమస్యలు విన్నారు. కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులను సన్మానించారు. పొన్నెకల్లులో ప్రజల ఆదాయం పెరిగేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, ఈ గ్రామంలో 369 పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు 11 మంది ముందుకు వచ్చారని చంద్రబాబు తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడంతో నిష్ణాతులు
తిరుమలలోలేని పింక్ డైమండ్‌ను తన ఇంట్లో ఉందని వైసిపి నాయకులు అసత్య ప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఈ అంశంపై తాను కోర్టులో కేసు వస్తే అసలు పింక్ డైమండ్ లేనేలేదని వైసిపి ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. వివేకా హత్య కేసు తనకు అంటగట్టాలని చూశారని, గొడ్డలితో వేసేసి గుండెపోటు అని చెప్పి, తర్వాత తాను చంపించినట్లు ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. ఈ హత్య గురించి ప్రశ్నించిన చెల్లి, అడిగిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, వివేకా హత్యలో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షులను చంపేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఆరుగురు సాక్షులు చనిపోయారన్నారు. ఈ సభలో మంత్రి డోలా బాల వీరాంజనేయులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ భార్గవ తేజ తదితరులు పాల్గొన్నారు.