స్టీల్‌ప్లాంట్‌ హెచ్‌ఒడి కార్యాలయాల వద్ద ఆందోళనలు

Aug 6,2024 22:45 #agitations, #offices, #Steelplant HOD

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఇఎస్‌ఐ లేనివారికి యాజమాన్యమే వైద్య సదుపాయం కల్పించాలని, నిర్వాసితులకు ఉపాధి దక్కేలా చూడాలని, ఎన్‌జెసిఎస్‌లో పెంచిన రూ.1200ను వెంటనే చెల్లించాలని, కార్మికులను తగ్గించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగాయి. స్టీల్‌ కోక్‌ ఓవెన్‌, ఆర్‌ఎంహెచ్‌పి, సిఆర్‌ఎంపి, సింటర్‌ప్లాంట్‌, టిపిపి, బిఎఫ్‌ డిపార్టుమెంటుల హెచ్‌ఒడి కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. సంఘం గౌరవాధ్యక్షులు ఒవి.రావు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం అలసత్వం వహిస్తే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రెండు నుంచి నాలుగు నెలలుగా జీతాలు లేకపోయినా అందరూ పనిచేస్తున్నారని, వారి సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై ఈ నెల 13న చలో అడ్మిన్‌ బిల్డింగ్‌ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, కెఎం.శ్రీనివాసరావు, చట్టి నర్సింగరావు, స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు యు.రామస్వామి, శ్రీనివాసరాజు, శ్రీరామ చంద్రమూర్తి, శ్రీనివాసరావు పాల్గన్నారు. ధర్నాల అనంతరం హెచ్‌ఒడిల కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.

➡️