విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్‌తో ఒప్పందం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గూగుల్‌ గ్లోబల్‌ సంస్థ రాష్ట్రంలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అమరావతిలో సిఎం నారా చంద్రబాబునాయుడు, ఐటి శాఖ మంత్రి లోకేష్‌ సమక్షంలో గూగుల్‌ ప్రతినిధులు, ఎపి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎంఒయుపై బుధవారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో దేశ ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో గూగుల్‌ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నామ న్నారు. పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్రంలో పటిష్టమైన ఎకోసిస్టమ్‌ ఏర్పాటవుతుందని తెలిపారు. మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్దినెలలకే ఆర్సెలర్స్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్స్‌, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, టాటా గ్రూప్‌, భారత్‌ ఫోర్డ్‌తో సహా పలు భారీ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. తన యుఎస్‌ పర్యటనలో గూగుల్‌ ఉన్నత స్థాయి ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గూగుల్‌ గ్లోబల్‌ నెట్‌ వర్కింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాష్‌ కోలే విశాఖపట్నంలో ప్రతిపాదించిన వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలను ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు వివరించారు. ఈ నెల 5వ తేదీన గూగుల్‌, ఎపి ప్రభుత్వం మధ్య ఎఐ ఇనిషియేటివ్‌లలో సహకరించడానికి ఎంఒయుపై సంతకం చేశామని, మలివిడతగా తమ బృందం దేశంలో గూగుల్‌ కార్యకలాపాలు, దాని భవిష్యత్తు ప్రణాళికలపై ఒప్పందానికి ఎపికి వచ్చినట్లు చెప్పారు. ఎపి తమకు కీలక భాగస్వామ్య రాష్ట్రమని బికాష్‌ కోలే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సిఎం చంద్రబాబు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఐటి పెట్టుబడులను ఆకర్షిం చడంతో గణనీయమైన ఆర్ధిక, సామాజిక వృద్ధిని సా ధించారని, అదేవిధంగా ఇప్పుడు ఎపిలో ఐటి పరిశ్రమ అభివృద్ధి సాధించగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్య దర్శి యువరాజ్‌, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️