ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నైపుణ్య గణనపై ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో శుక్రవారం ఈ ఒప్పందం జరిగింది. నైపుణ్య గణనలో జనరేటివ్ ఎఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధ్రువీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), ఇన్ఫోసిస్ మధ్య ఎంఒయు కుదిరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రివాలిడేషన్‌కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గణన
రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. కులగణన విధి విధానాలపై స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ గణన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన నైపుణ్యగణన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని మరింత అర్థవంతంగా, సులభతరంగా ఈ గణన చేపట్టాలని ఆదేశించారు. ఈ గణన సేకరించిన డేటా యువతకు జీవితకాలం ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కూడా సేకరించాలని చెప్పారు. అరబ్, యూరోపియన్, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో స్కిల్ వర్కర్లకు డిమాండ్ ఉందని, అవసరాన్ని బట్టి స్థానికంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తే సుమారు 2 లక్షల మందికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని తెలిపారు. దీనికోసం వివిధ ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి భాషలను కూడా నేర్పించాలని సూచించారు. డేటా సమీకృతం చేసే సమయంలో సీడాప్, ఎపిఎస్‌ఎస్‌డిసి, నాప్ డాటా డబ్లింగ్ కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శి కోన శశిధర్, ఎమ్‌డి గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.