ప్రజాశక్తి-గుంటూరు : ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ అగ్రిసెట్ 2024 పరీక్షా ఫలితాల వివరాలు శుక్రవారం నుండి అందుబాటులో ఉంటాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. జి. రామచంద్ర రావు తెలిపారు. విద్యార్ధులు ర్యాంకు కార్డులను వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అగ్రి సెట్ కౌన్సిలింగ్ కొరకు దరఖాస్తు మరియు కౌన్సిలింగ్ తేదీలు తదితర వివరాల కొరకు angrau.ac.in వెబ్ సైట్ ను తరచూ సందర్సించవలసినదిగా ఆయన కోరారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు జిల్లా, లాం పరిధిలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం మరియు విత్తన సాంకేతిక పరిజ్ఞానము విభాగాలలో డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు వ్యవసాయ డిగ్రీ కోర్సు నందు ప్రవేశాల కొరకు ప్రతి సంవత్సరం నిర్వహించే అగ్రిసెట్ 2024 ప్రవేశ పరీక్షను 27.08.2024 న ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉప కులపతి, డా ఆర్. శారద జయలక్ష్మి దేవి 09.10.2024న విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో డా సి. హెచ్. శ్రీనివాసరావు, డీన్, డా ఏ.వి. రమణ, పీ.జి డీన్, డా ఎన్.సి. వెంకటేశ్వర్లు, డైరెక్టర్, పాలిటెక్నిక్స్, డా ఎం శేష మహాలక్ష్మి, టెక్నికల్ ఆఫీసర్, పాలిటెక్నిక్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రవేశ పరీక్షకు 897 బాలికలు మరియు 659 బాలురు, మొత్తం 1556 విద్యార్థులు హాజరు అవ్వడం జరిగింది. వీరిలో 1469 మంది వ్యవసాయ డిప్లొమా, 35 మంది సేంద్రియ వ్యవసాయం మరియు 52 మంది విత్తన సాంకేతిక పరిజ్ఞానము విభాగాలలో హాజరు అవ్వగా మొత్తం 1447 (93.0 %) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ డిప్లొమాలో పంగా రామ వెంకట సుభాష్, మట్టా లావణ్య మరియు రాచకొండ నాగలక్ష్మి 115 మార్కులు సాధించి మొదటి మూడు రాంకులు సాధించారు. సేంద్రియ వ్యవసాయ పరీక్షలో ఆదరణ పాలిటెక్నిక్ కి చెందిన కలగురి రాజేష్ 92 మార్కులు సాధించగా, విత్తన సాంకేతిక పాలిటెక్నిక్ పరీక్షలో జంగమహేశ్వర పురం పాలిటెక్నిక్ కు చెందిన మొక్కా మేఘన 95 మార్కులతో సాధించి మొదటి స్థానంలో నిలిచారు.