సంక్షోభంలో వ్యవసాయ రంగం

  • వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-తోటపల్లి గూడూరు : కేంద్ర ప్రభుత్వ అసమర్ధ పాలనతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విమర్శించారు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం, నరుకూరు వాణిమహల్లో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకొని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై సదస్సు జరిగింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్ని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాల వల్ల ప్రస్తుతం వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వ్యవసాయ కార్మికులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలను టిడిపి కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయ పనులు లేక కార్మికులు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని దేశమంతా అమలు చేయడానికి సరిపడా నిధులు కేటాయించాలని, 200 రోజులు పని కల్పించి రూ.600 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరిగే సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️