విద్యకు ఎఐ సెంటర్‌ మా రాష్ట్రానికివ్వండి

  • మంగళగిరిలో రైల్వే భూములను మాకు అప్పగించండి
  • కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి లోకేష్‌ విజ్ఞప్తి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేయాలని ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్‌ కోరారు. అలాగే డేటా సిటీల ఏర్పాటుకు సింగిల్‌ విండో అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ రైల్‌ భవన్‌లో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్‌శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను లోకేష్‌ కలిశారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అత్యధికంగా కేటాయింపులు చేశారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటి, ఎలక్ట్రానిక్స్‌ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, నూతనంగా తీసుకొచ్చిన పాలసీల గురించి కేంద్ర మంత్రికి లోకేష్‌ వివరించారు. ఎపిలో ఐటి, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానంలో త్వరితగతిన అనుమతులు ఇవ్వడమే కాకుండా, ప్రాజెక్టులు త్వరితగతిన ఏర్పాటయ్యేలా స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఎఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని లోకేష్‌ కోరారు. ఎఐతో రాబోతున్న అవ కాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ సిద్ధం గా ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో తాము ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సిటీకి సహకరించాలని కోరారు.

ఎఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్‌ విండో పద్ధతిలో కేంద్రం నుండి అనుమతులు సులభతరం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారని, మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కోరారు. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు.

సమిష్టి కృషితోనే రాష్ట్రానికి మేలు

కలిసికట్టుగా ఉండటం వల్లే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇకముందు కూడా ఇదే పంథా కొనసాగిస్తామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఆయన కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, టిడిపి ఎంపిలు, బిజెపి నేతలు మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సమిష్టి కృషితో విశాఖ రైల్వే జోన్‌, అమరావతి, పోలవరం, స్టీల్‌ప్లాంట్‌కు నిధులు తెచ్చుకోగలిగామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపిలు చేస్తున్న కృషిని లోకేష్‌ అభినందించారు.

➡️