ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాంకేతికతను మానవాళికి మేలు కలిగించే రీతిలో మీడియా వినియోగించుకోవాలని సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి కె పార్థసారధి తెలిపారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా 38వ పిఆర్‌డే వేడుకలు విజయవాడలోని పిబి సిద్ధార్ధ కళాశాలలో బుధవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పార్థసారధి మాట్లాడుతూ.. సోషల్ మీడియా మితిమీరిన వినియోగం కూడా సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ధోరణులు చాలా దారుణంగా ఉన్నాయని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎంతో ముందంజలో ఉన్నారని తెలిపారు. విజన్ పేరుతో దేశ, రాష్ట్రం బాగు కోసం ఆలోచించే వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ విసి డివిఆర్ మూర్తి, విజయవాడ డివిజన్ సౌత్ సెంట్రల్ పిఆర్‌ఒ నస్రత్ ఎం మండ్రూప్కర్, పిఆర్‌ఎస్‌ఐ అమరావతి చాప్టర్ ఛైర్మన్ అనిత్, సమాచార, పౌరసంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్, పిఆర్‌ఎస్‌ఐ అమరావతి చాప్టర్ వైస్ ఛైర్మన్ జె రాజేంద్రకుమార్, కార్యదర్శి ఎమ్‌డి కె పార్థసారధి, జాయింట్ సెక్రటరీ పి బషీర్, ట్రెజరర్ ఓలివా ఎరమల తదితరులు పాల్గొన్నారు.
