విశాఖ ఘటనపై ఐద్వా ఖండన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: విశాఖపట్నంలోని చైతన్య కళాశాలలో లైంగిక వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఘటనను ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి ఖండించారు. విశాఖ ఘటనలో నిందితులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో వేధింపుల వల్లే తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో ఆ విద్యార్థి మెసేజ్‌ పెట్టిందని, కలేజీలో సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ చేస్తుండటం, ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించడం వంటి కారణాలతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. ఒక్కరైనా చనిపోతే ప్రపంచానికి తెలుస్తుందని విద్యార్థి చెప్పడం చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థల్లో ఈ పరిస్థితి ఉండటం కంచే చేను మేసినట్లుగా ఉందన్నారు. విద్యార్థి ఆత్మహత్య సంఘటనకు సంబంధించి పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారని, ఈ సంఘటన వెనుక ఉన్న వ్యక్తులను బయటకు తేవాలని, ఇంత వరకు అధ్యాపకులను గుర్తించి వారిపై చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని అన్నారు. చట్టపరంగా ఉండాల్సిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఈ కళాశాలల్లో ఎక్కడా లేవన్నారు.

➡️