అల్పపీడనం నేపథ్యంలో అప్రమత్తం

  • 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు
  • ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు
  • అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీస్‌, విపత్తుల నిర్వహణశాఖ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తుపానుతో ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌ లైన్‌లు ఏర్పాటుచేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్న నేపథ్యంలో గండ్లు పడే కాలువలు, గట్లను గుర్తించి పర్యవేక్షించాలని సూచించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వాగులు పొంగే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ శాఖలన్నీ సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నియంత్రించే చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

➡️