- సదస్సులో అజశర్మ, గంగారావు
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : రాష్ట్రంలో గౌతం అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలన్నీ రాష్ట్ర రాజకీయ పార్టీలకు ముడుపులు చెల్లించి చేసుకున్న అక్రమ ఒప్పందాలేనని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, జివిఎంసి ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు అన్నారు. ‘అదానీ ముడుపులు – విద్యుత్ ఒప్పందాలు – ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల పాత్ర’ అనే అంశంపై సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన శనివారం సదస్సు జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అజశర్మ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో గత ప్రభుత్వ పెద్దలకు అదానీ రూ.2029 కోట్లు ముడుపులు చెల్లించినట్లు అమెరికా న్యాయవ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు నవంబరు 20న బయపెట్టారన్నారు. నేటికి 10 రోజులు గడిచినా ముడుపులు చెల్లించిన అదానీపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక భారతదేశ సంపదను, వనరులను అదానీకి దోచిపెట్టారన్నారు. విద్యుత్, రైల్వే, ఎయిర్ ఇండియా, పోర్టులు, రోడ్లు, బొగ్గు, ఇనుప ఖనిజం తదితరాలను అదానీపరం చేయడంతో ప్రపంచంలోనే కుబేరుల జాబితాలోకి వెళ్లారని గుర్తు చేశారు. సోలార్ విద్యుత్‌పై సెకీ ద్వారా ఒప్పందం చేసుకొని అదానీ సంస్థ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసుకునే విధంగా ఈ ఒప్పందం ఉండటంతో వినియోగదారులపై పెను భారం పడుతోందన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు పంపిణీ బాధ్యత కూడా అదానీ సంస్థకే కట్టబెట్టడం వెనుక భారీ ముడుపులు ముట్టాయని తెలిపారు.
డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ, రాష్ట్ర సంపదను అదానీ పరంచేయడంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షపార్టీలు పోటీ పడ్డాయన్నారు. సోలార్ విద్యుత్‌కు రాష్ట్రంలో గత ప్రభుత్వం అల్లూరి జిల్లాలోని భూములను అదానీకి కట్టబెట్టిందని తెలిపారు. విద్యుత్ ఒప్పందాల్లో రూ.1750 కోట్లు ముడుపులు తీసుకున్నట్లుగా అమెరికా న్యాయవ్యవస్థ వెల్లడించిందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రయివేట్ సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసుకునే విధంగా చర్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను అదానీకి కట్టబెట్టారన్నారు. సాగరతీరంలో స్యాండ్ మైనింగ్, కాపులుప్పాడ డేటా సెంటర్, అప్పికొండ వద్ద డీశానిటేషన్ ప్లాంట్ తదితరాలను అదానీకి అప్పగించారన్నారు. ఈ ఒప్పందాలన్నింటిలోనూ వైసిపి, టిడిపి, జనసేన పార్టీల పాత్ర కీలకంగా ఉందన్నారు. అదానీకి రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరుమెదపటం లేదన్నారు. విశాఖకు, ఆంధ్రరాష్ట్రానికి తీవ్ర నష్టం చేసే అదానీ గ్రూపుతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దుచేయాలని, గంగవరం పోర్టును స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలని, డేటా సెంటర్, సాండ్‌మైనింగ్‌ను, సౌర విద్యుత్ ఒప్పందాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.