ఇఎపిసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

May 15,2024 22:29 #EAPCET-2024, #Exams
  •  నేటి నుంచి 23 వరకు
  •  ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం
  •  ఎపి స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌
  • హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ హేమచంద్రా రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల కామన్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ఇఎపిసెట్‌-2024 ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె హేమచంద్రా రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి ఈ నెల 23 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 రీజనల్‌ కేంద్రాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాద్‌లో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నంద్యాలలో రెండు పరీక్ష కేంద్రాలు మార్పు చేశామని తెలిపారు. పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధం వుందన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది వున్నారని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది 22,901 మంది ఎంట్రన్స్‌ పరీక్షకు అధికంగా దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ప్రవేశ పరీక్షలు రోజుకు రెండు సెషన్స్‌లో ఎంట్రన్స్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ బేస్డ్‌ (కంప్యూటర్‌ ద్వారా) పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. బైపిసి విద్యార్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో 4 సెషన్స్‌లో, ఎంపిసి విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 23 వరకు 9 సెషన్స్‌లో నిర్వహిస్తున్నామని వివరించారు. రోజుకు రెండు సెషన్స్‌లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఎంట్రన్స్‌ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. పరీక్షా కేంద్రం వద్దకు అభ్యర్థులు కనీసం గంట ముందు చేరుకోవాలని సూచించారు. పరీక్షా హాల్‌లోకి సెల్‌ఫోన్‌, బ్లూ టూత్‌, కాలిక్యులేటర్‌ తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతించబోమని అన్నారు. సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌ 08842359599, 08842342499 ఏర్పాటుచేశామని తెలిపారు. సమావేశంలో జెఎన్‌టియు వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ జివిఆర్‌ ప్రసాదరాజు, ఎపిఎస్‌సిహెచ్‌ఇ వైస్‌ ఛైర్మన్‌ కె రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

➡️