‘గోవాడ’పై కూటమి వాగ్దానాలు ఏమయ్యాయి?

  • ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి- చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంటే టిడిపి కూటమి నాయకుల వాగ్దానాలు ఏమయ్యాయని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీని సోమవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం విలేకర్లతో బొత్స మాట్లాడుతూ వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీకి రూ.89 కోట్లు ఇచ్చి ఆదుకుందని తెలిపారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో రోజురోజుకూ క్రషింగ్‌ అంతరాయం ఏర్పడుతుంటే చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అనకాపల్లి ఎంపి సిఎం రమేష్‌ తన వ్యాపార కార్యకలాపాలను ఢిల్లీలో సాగిస్తూ ఈ ప్రాంత రైతుల, కార్మికుల అభివృద్ధిని వదిలేశారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, తాము అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ మనుగడ కోసం పని చేశామన్నారు. మాజీ మంత్రి. చోడవరం వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానన్న చంద్రబాబు ఉన్న పరిశ్రమలను మూసేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, నాయకులు పుల్లేటి వెంకటేష్‌, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

➡️