- 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ పనగారియాతో చంద్రబాబు భేటీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. సోమవారం నాడిక్కడ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో ఆయన భేటీ అయ్యారు. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల వైసిపి దుష్పరిపాలన, పలు రంగాల వారీగా జరిగిన నష్టంపై సిఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. 2014-19 మధ్య అభివృద్ధికి, ఆ తర్వాత ఐదేళ్లలో చోటుచేసుకున్న దుష్పరిపాలనతో పొంతన లేకుండా పోయిందని, రాష్ట్రం చాలా నష్టపోయిందని ప్రజెం టేషన్‌లో చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని, దానికితోడు మరో రూ.లక్షన్నర కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు వదిలి పెట్టిపోయారని సిఎం తెలిపారు. పోర్టు ఆధారిత, పరిశ్రమల ఆధారిత అభివృద్ధి ఎలా చేయాలన్న దానిపై సమావేశంలో చర్చించారు. డీప్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, ఎఐలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలపైనా ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఎపికి ఆక్సిజన్ అందించేలా బడ్జెట్ కేటాయింపులు
వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేలా కేంద్ర బడ్జెట్ ఉందని సిఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బడ్జెట్‌లో ఎపికి కేటాయింపులు చూస్తే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఆక్సిజన్‌లా ఉంది. కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూతతో రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో నడిపించడమే మా ముందున్న లక్ష్యం’ అని అన్నారు. ‘ఎపికి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంది. ఎఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీలతో మోడీ ప్రభుత్వం ముందుకెళుతోంది. గత విధ్వంస పాలనతో అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కుపోయింది. విభజనతోనే కాదు, గత ప్రభుత్వ విధ్వంసంతోనూ రాష్ట్రం దెబ్బతిన్నది’ అని అన్నారు. ఏడు నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకె ళుతున్నామని అన్నారు. ‘ఎఐ, గ్రీన్ ఎనర్జీ, అగ్రికల్చర్, జీరో పాపర్టీ, ఎంఎస్‌ఎంఇల విషయంలో కేంద్రం ఆలోచనలకు తగ్గట్టు ఏపి అనుసరిస్తోంది. కొందరు రాజకీయ లబ్ధి కోసం బడ్జెట్‌లో ఎపికి చేసిన కేటాయింపులపై విమర్శలు చేస్తున్నారు. బడ్జెట్‌లో ఎపి పేరు ప్రస్తావనపై మాట్లాడుతున్నారు. కేంద్రం మన రాష్ట్రానికి నిధులు కేటాయించి ఆదుకోవడం ముఖ్యం కానీ ప్రతిసారీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.