ప్రజాశక్తి-భోగాపురం (విజయనగరం జిల్లా) : విమానాశ్రయం లోపల నేవీకి పది ఎకరాల భూమిని కేటాయించడంతో ఆ భూములను నేవీ అధికారులు శుక్రవారం పరిశీలించారు. విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగాకు చెందిన కొంతమంది నేవీ అధికారులు ఈ భూముల వ్యవహారంపై జిఎంఆర్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. సముద్ర తీరానికి దగ్గరలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా సరే నేవీకి తప్పనిసరిగా భూములు కేటాయించాల్సి ఉంటుంది. ఆ భూముల్లో గస్తీకి సంబంధించిన భవనాన్ని నిర్మించనున్నారు. సముద్రం నుంచి చొరబాటుదారులు రాకుండా ఉండేందుకు విమానాశ్రయం లోపల నుంచి గస్తీని నిర్వహించనున్నారు. విమానాశ్రయం లోపల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టవర్ సమీపంలో ఈ భూములను కేటాయించినట్లు చెబుతున్నారు. భూములకు సంబంధించిన వివరాలను జిఎంఆర్ సంస్థ ప్రతినిధి రామరాజు, ఆర్‌డిఒ దాట్ల కీర్తి తెలియజేశారు. తహశీల్దార్ ఎం.సురేష్, ఆర్‌ఐ ఇమ్రాన్, విఆర్‌ఒ నారాయణస్వామి నాయుడు పాల్గొన్నారు.