ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మెగా డిఎస్‌సితో పాటు ఆదివాసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత చేసి ప్రత్యేక డిఎస్‌సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆయన రాసిన లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి అవసరమైన ప్రకటన నవంబరు ఆరున ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను ఈ లేఖలో శ్రీనివాసరావు ప్రస్తావించారు. షెడ్యూల్డు ఏరియాలో నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పించే జిఓ 3ని 2020లో సుప్రీం కోర్టు రద్దుచేస్తే గత ప్రభుత్వం పునరుద్ధరించకుండానే జనరల్ డిఎస్‌సి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆదివాసీలు ఆందోళనకు గురయ్యారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్‌సి ద్వారా ఏజన్సీలో గిరిజన సంక్షేమ, ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. మెగా డిఎస్‌సితోపాటు ఆదివాసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత చేసి ప్రత్యేక డిఎస్‌సి ద్వారా ఎజెన్సీలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.
గిరిజన గురుకులం పోస్టులపై …
గురుకులం(బైలా) నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఫ్రభుత్వం జనరల్ డిఎస్‌సిలో గురుకులం పోస్టులను కూడా విలీనం చేసిందని లేఖలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన గురుకులానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం పిజిటి 58 పోస్టులు, టిజిటి 446 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడం దారుణమని పేర్కొన్నారు. గిరిజన గురుకులంలో జోనల్ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారని, కానీ జనరల్ డిఎస్‌సిలో మాత్రం జిల్లా యూనిట్‌గా నోటిఫికేషన్ జారీచేశారని, 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న టీచర్లను రెగ్యులర్ చేయకుండా జనరల్ డిఎస్‌సి ద్వారా స్కూల్ ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులైన ఆదివాసీలను గెంటివేయొద్దని కోరారు. ఏజన్సీ ప్రాంత ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్‌కు గత రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూలు క్లాజ్(2) ప్రకారం చట్టబద్ధత కల్పిస్తామని ట్రైబల్ ఎడ్వయిజరీ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని ప్రస్తుత ఫ్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రమైన అభద్రతాభావం, ఆందోళనతో ఉన్నారని, నేటికీ పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలకూ ఉపక్రమించకపోవడంతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు ఏరియాలో ఆదివాసీల భద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత గురించి స్పషంగా పేర్కొన్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే ఏ ఉత్తర్వులైనా 5వ షెడ్యూలు క్లాజ్(1)(2) ప్రకారం గవర్నర్, టిఏసి అనుమతి తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. ఆదివాసులకు ప్రత్యేక భాష, సంస్కృతి ఉన్నాయని, గిరిజన భాష రాని ఉపాధ్యాయులను ఏజన్సీలో నియమించడం వల్ల ఆర్టికల్ 29, 32 లను ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపారు. కెజిబివి ఏకలవ్య మోడల్ స్కూల్స్‌తోపాటు గత ప్రభుత్వాల కాలంలో 1998, 2008లో సుమారు 400 మరియు 2000 డిఎస్‌సి ద్వారా 280 ఎస్‌జిటి పోస్టులను పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మినిమం టైమ్ స్కేల్ ప్రాతిపదికన స్థానికేతరులతో గత ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోయి తీవ్ర ఆవేదనతో ఉన్నారని వివరించారు. ఆధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పిస్తామని నాడు అరకు ఎన్నికల సభలో నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం విదితమేనని లేఖలో పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌తోపాటు ఆదివాసీ స్పెషల్ డిఎస్‌సి నోటిఫికేషన్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీకి పున:పరిశీలించి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు ఉపాధి కల్పిన, భద్రతా, భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నవంబరు 11న ప్రభుత్వం నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఏజెన్సీ ప్రాంత స్థానిక ఆదివాసులకు నూరుశాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించే షెడ్యూలు ఏరియా ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని కోరారు. లేఖ కాపీని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కూడా శ్రీనివాసరావు పంపించారు.