- ముగిసిన ప్రజాప్రతినిధుల ఆటల పోటీలు
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్ : గత రెండు రోజులుగా ప్రజాప్రతినిధులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో గురువారం బహుమతుల ప్రదానోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ధుర్యోధనుడిగా డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఏకపాత్రాభినయం, బాల చంద్రుడిగా కందుల దుర్గేష్ అలరించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ… వినోదం ఒక సందేశమని… డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చెప్పిన డైలాగులు వినగానే ఎన్‌టిఆర్ గుర్తొచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బ్రహ్మాండంగా నటించారన్నారు. కార్యకర్త నాయకుడిని ఎలా అడుగుతాడో మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కూడా అలాగే అడిగారని, ఆంజనేయులు కూడా ఎమ్మెల్యే ఎలా స్పందించాలే అలాగే స్పందించి నటించారని (నవ్వుతూ) అన్నారు. ఎమ్మెల్యేలంతా ఈ విధంగా ఉత్సాహంగా ఉంటే ఆసుపత్రులకు వెళ్లే అవసరం ఉండదన్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం అనేది ప్రజాసమస్యలపై పోరాడటానికి తప్ప వ్యక్తిగత విభేదాలు పెట్టుకోవడానికి కాదన్నారు. మర్రి చెన్నారెడ్డి సిఎంగా ఉన్నప్పుడు ఓ అంశంపై తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమోషన్‌లో బల్ల గుద్ది చెప్పానని, చెన్నారెడ్డికి కోపం వచ్చి బల్ల ఎందుకు గుద్దావు ఏమనుకుంటున్నావు అని తనను ప్రశ్నించారని తెలిపారు. అసెంబ్లీ అనేది ప్రజలకు జావాబుదారీతనంగా ఉండాలి తప్ప ప్రతిపక్షాలకు కాదన్నారు. ప్రజలకు కావాల్సింది సమస్యల పరిష్కారం మాత్రమేనన్నారు. బూతులు తిడితే తిట్టిన వారికి ఆనందం కలిగిస్తాయి తప్ప ప్రజలకు కాదన్నారు. త్వరలో ప్రధాని సభలో కూచిపూడి నాట్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తామని, వచ్చే ఏడాది కూడా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..ఇదో అద్భుతమైన రోజు అని అన్నారు. శాసనసభలో ఎస్‌సి వర్గీకరణ బిల్లు మీద తీర్మానం చేసిన రోజు, మందకృష్ణ గారి పోరాట స్పూర్తితో సుమారు మూడు దశబ్ధాల పోరాటానికి విజయం సాధించిన రోజు అని చెప్పారు. ఇలాంటి సంప్రదాయాలు ఎల్లప్పుడు కొనసాగాలని కోరారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… 1983 నుంచి ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. అప్పట్లో ఎప్పుడూ ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్ జరుగుతుండేవని, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు కూడా సాంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొని దుర్యోధనుడి పాత్ర వేసి మొదటి బహుమతి గెలుచుకున్నారని గుర్తు చేశారు. అదే ఒరవడిని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తున్నారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధితాధికారులు, తదితరలు పాల్గొన్నారు.