- లోక్‌సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితికి లెక్కించకూడదని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సోమవారం లోకసభలో వైసిపి ఎంపి ఎం.గురుమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన అమరావతి నిర్మాణానికి విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణాలు ఏవీ ఆ రాష్ట్ర అప్పుల పరిధిలోకి రావని పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ఇప్పటి వరకు ప్రత్యేక సాయం గ్రాంట్స్ కింద రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత, సుస్ధిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.6,700 కోట్లు (800 అమెరికన్ మిలియన్ డాలర్లు) చొప్పున రుణ ఆమోదం కోసం సాయం చేశామని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ రుణాలకు సంబంధించిన పంపిణీ ఇంకా జరగలేదని చెప్పారు. ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10 శాతానికి మించకుండా.. గరిష్టంగా రూ.1,500 కోట్లు, ప్రత్యేక సాయంగా గ్రాంట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు ”కౌంటర్ పార్ట్ ఫండింగ్” సమకూర్చాలని కూడా నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్టుకు అందిస్తున్న రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిలో లెక్కించ కూడదని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రుణం మంజూరు చేసేటప్పుడు రూపొందించిన మార్గదర్శకాలు, షరతులను అనుసరించి నిధుల వినియోగ పర్యవేక్షణ జరుగుతుందని పేర్కొన్నారు.