ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తిరుపతిలో టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో అసలైన బాధ్యులను వదలిపెట్టి మొక్కుబడి చర్యలు తీసుకున్నారని, ఈ విషయంలో సిఎం చంద్రబాబు చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాటకు టిటిడి చైర్మన్, ఇఒ, జెఇఒ, జిల్లా ఎస్‌పి బాధ్యులైతే ఇద్దరు దిగువ స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చంద్రబాబు చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. వైసిపి హయంలో చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఇఒ ధర్మారెడ్డి వంటి కీలక వ్యక్తులను భ్రష్టుపట్టించి జగన్‌ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు టిటిడి చైర్మన్, ఇఒ, జెఇఒ, తిరుపతి జిల్లా ఎస్‌పిని ప్రత్యేకంగా నియమించుకున్నారని తెలిపారు. సిఎం, డిప్యూటీ సిఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. టిటిడి చైర్మన్, ఇఒ, జెఇఒ తీరును పవన్ కల్యాణ్ తప్పుపట్టగా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కనీసం రెండు వేల మందిని అదుపు చేయలేని యంత్రాంగాన్ని పర్యవేక్షించే ఎస్‌పిపై మొక్కుబడిగా బదిలీ చేసి చేతులు దులుపుకొంటారా? అని ప్రశ్నించారు. కీలకమైన అధికారులను వదిలి డిఎస్‌పి, గోశాల డైరెక్టర్‌లను సస్పెండ్ పెద్ద హైడ్రామాకు తెరతీశారని ధ్యజమెత్తారు.