ప్రజాశక్తి-అమరావతి : అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఐదు ఫిర్యాదులపై పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన విషయం తనకు తెలియదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టుకు సోమవారం తెలిపారు.ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదంటూ వ్యక్తిగత హోదాలో అంబటి హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం వ్యక్తిగతంగా ఆయన హాజరై స్వయంగా వాదనలు వినిపించారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం
సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డిని అక్రమ నిర్బంధి ంచారన్న పిటిషన్‌లో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారో, ఎప్పుడు అరెస్ట్ చూపారో, థర్డ్ డిగ్రీ ప్రయోగించారా లేదా అనే ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబులు రావాలంది.
విజరుకుమార్ రెడ్డి బెయిల్ కేసు నుంచి తప్పుకున్న జడ్జి
సాక్షి పత్రిక, సాక్షి టివి ఛానల్‌కు అత్యధిక ప్రయోజనం చేకూరేలా ప్రకటనలు జారీ చేశారంటూ ఎసిబి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సమాచార, పౌరసంబంధాల శాఖ గత కమిషనర్ తుమ్మా విజరుకుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి తప్పుకున్నారు. పిటిషన్ మరోబెంచ్ ముందు విచారణకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ జనవరి 8కి వాయిదా వేశారు.
పేర్నినాని పిటిషన్‌పై నేడు విచారణ
బందరులోని గోడౌన్ నుండి రేషన్ బియ్యం మాయమైందన్న కేసులో వైసిపి నేత, మాజీ మంత్రి పేర్నినానిపై నమోదైన కేసులో హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ నెల 8వ తేదీ వరకు పేర్ని నానిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ పాస్‌పోర్టు వివాదంపై పిటిషన్ – తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
పాస్‌పోర్టు మంజూరు నిమిత్తం ఎన్‌ఒసి జారీ వ్యవహారంలో తమ ముందు హాజరై రూ.20 వేల స్వీయ పూచికత్తు సమర్పించాలని విజయవాడ ప్రత్యేక కోర్టు (ఎంపి, ఎమ్మెల్యేలను విచారించే ప్రజా ప్రతినిధుల కోర్టు) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మాజీ సిఎం వైఎస్ జనన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
టిడిపి ఆఫీసుపై దాడి కేసులో నిందితులకు చుక్కెదురు
గన్నవరం టిడిపి ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం 33 మంది నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద సెక్షన్లు నమోదైనందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలంది. ఈ మేరకు జస్టిస్ విఆర్‌కె కృపాసాగర్ సోమవారం తీర్పు చెప్పారు.
సిఐడి మాజీ చీఫ్ సంజయ్ – ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
నిధులు దుర్వినియోగం ఆరోపణలతో ఎసిబి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సిఐడి మాజీ చీఫ్, ఐపిఎస్ అధికారి ఎన్ సంజరు వేసిన పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు గడువు కావాలని పిపి కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.