- విద్యార్థులకు ధర్నాకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మద్దతు
ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు కెఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ తెలంగాణ కేంద్రంగా ఉన్న ఈ యూనివర్సిటీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల గడువు ముగిసిందని 2024-25 విద్యా సంవత్సరానికి మన రాష్ట్రంలో అడ్మిషన్లు నిలిపివేసిందన్నారు. దీంతో ఎపిలో విద్యను అభ్యసించాలని భావించిన వేలాది మంది అడ్మిషన్లు పొందలేకపోతున్నారని తెలిపారు. యూనివర్సిటీకి అనుబంధంగా రాష్ట్రంలోని సెంటర్స్‌లో పనిచేస్తున్న దాదాపు 450 మంది రెగ్యులర్, పార్ట్‌టైమ్ ఉద్యోగులకూ జీతాలు సైతం ఆపేశారన్నారు. తెలంగాణ వారికే నోటిఫికేషన్ ఇచ్చారని, ఎపికి అన్ని రకాల సర్వీసులు నిలుపుదల చేశారన్నారు. గత పదేళ్లుగా మన రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకోలేదని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే వారికి, తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఎపిలో ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఏటా దాదాపు 30 వేల అడ్మిషన్లు నమోదు అవుతాయన్నారు. దేశంలోనే దూర విద్యా విధానంలో ప్రారంభమైన మొదటి యూనివర్సిటి ఇదేనని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ధర్నాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజరుకుమార్, సిపిఎం నాయకులు ముత్యాలరావు, వివిధ విద్యార్థి, దళిత, ప్రజా సంఘాల నాయకులు నీలాంబరం, చిన్నా, డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.