అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

  • ఆగంతకుల దుశ్చర్య
  • దళిత, ప్రజాసంఘాల నిరసన
  • అదే ప్రదేశంలో మరో విగ్రహం ఏర్పాటు

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల (ఏలూరు జిల్లా)  : దేశవ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో గుర్తు తెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ప్రసిద్ధక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని పంచాయతీ పార్క్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని సోమవారం రాత్రి కూల్చివేశారు. దీనిపై స్థానికులు, దళిత, ప్రజాసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమడోలు సిఐ ఎంజె.విల్సన్‌, ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి.సుధీర్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుంటామని, అంతా సంయమనం పాటించాలని సిఐ కోరారు. ఆ విగ్రహం స్థానంలో మరో విగ్రహన్ని ఏర్పాటు చేశారు. అంబ్కేదర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని దళిత సంఘాలు, అంబేద్కర్‌ సేవా సమితి ఆందోళన నిర్వహించాయి.

➡️