అంబేద్కర్‌ రాజ్యాంగం అమలుకావట్లేదు : అంబటి

Capital of Amaravate Ambati Rambabu

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో లేదని, లోకేష్‌ రూపొందించిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని వైసిపి జిల్లా కార్యాలయంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు, స్వేచ్ఛను కల్పించిందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప పరిపాలనపై దృష్టి పెట్టడంలేదని విమర్శించారు. ప్రజలు త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. నారా లోకేష్‌ ఆదేశాల మేరకు పోలీసులు వైసిపి సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి అక్రమంగా జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా లోకేష్‌ డైరెక్షన్లో నడుస్తోందని, ఒక్కొక్క వైసిపి సోషల్‌ మీడియా కార్యకర్తలపై 10, 15 కేసులు బనాయించి భయభ్రాంతులను గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా పాలనపై దృష్టి సారించాలని, అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు.

➡️