ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం సాగిస్తామని సిఐటియు సీనియర్ నాయకులు వై.రాజు అన్నారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1477వ రోజుకు చేరాయి. దీక్షలో పాల్గొన్న సిఐటియు జగదాంబ జోన్ కమిటీ నాయకులు, కార్యకర్తలు శిబిరంలోనే అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రచించిన భారత రాజ్యాంగాన్ని కాషాయీకరించే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందన్నారు. రాజ్యాంగ మూల సూత్రాలైనటువంటి సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదాలను పూర్తిగా నీరుగారుస్తోందని తెలిపారు. రిజర్వేషన్లు అమలు జరిగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తోందని అన్నారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటాలతో ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో ముఠా కార్మిక సంఘం నాయకులు ఎం.సుబ్బారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె.నర్సింగరావు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార, మత్స్యకార్మిక సంఘం నాయకులు కె.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
