ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, సంస్థల ఛైర్మన్‌లు, డైరెక్టర్ల (నామినేటెడ్ పోస్టులు)కు చెల్లించే వేతనాలు, అలవెన్సులకు సంబంధించి గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులకు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు జిఎడి ముఖ్యకార్యదర్శి ముకేష్ కుమార్ మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్లు, బోర్డులు, సంస్థలను ప్రభుత్వం ఎ, బి కేటగిరీలుగా విభజించింది. గతంలో ఎ కేటగిరిలో ఉన్న ఎపి పద్మాశాలీ సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఎపి యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థలను ప్రస్తుతం బి కేటగిరిలోకి చేర్చగా, గతంలో బి కేటగిరిలో ఉన్న ఎపి బయోడైవర్సిటీ బోర్డు, ఎపి స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్, ఎపి టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, ఎపి ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, ఎపి ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీలను ప్రస్తుతం ఎ కేటగిరిలో చేర్చారు. వీటితోపాటు ఎ కేటగిరిలో కొత్తగా ఎపిఎంఎస్‌ఐడిసి, ఎపి కల్చరల్ మిషన్, ఎపి గ్రంథాలయ పరిషత్, ఎపి నాటక అకాడమి, ఎపి పోలీస్ హౌసింగ్ బోర్డును చేర్చగా, బి కేటగిరిలో ఎపి కొప్పుల వెలమ, రజక, కాపు, మాల, అగ్నికుల క్షత్రియ, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి బోయ సంక్షేమ అభివృద్ధి సంస్థలు, అన్నమయ్య, రాజమండ్రి, అనంతపూర్ – హిందూపురం, కాకినాడ, మచిలీపట్నం, శ్రీకాకుళం, విశాఖపట్నం మెట్రో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను చేర్చారు. వీరికి చెల్లించే వేతనాలు, ఇతర అలవెన్సులు యథాతథంగా ఉన్నాయి. ఎ కేటగిరిలో ఉన్న సంస్థల ఛైర్మన్‌లకు వేతనం, అలవెన్సులు కలిపి మొత్తం రూ.2,77,500, బి కేటగిరిలోని సంస్థల ఛైర్మన్‌లకు రూ.1,93,500 చెల్లించనున్నారు.
