అమిత్‌ షా ‘గోబ్యాక్‌ ‘

Jan 19,2025 23:37 #Amit Shah's Remark, #cpm protest

 వామపక్షాల ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు
ప్రజాశక్తి-యంత్రాంగం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన, అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. అమిత్‌ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. అమిత్‌ షా వైఖరిని ప్రజాతంత్రవాదులంతా ఖండించాలని కోరారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, సిపిఐ నాయకులు జి కోటేశ్వరరావు అధ్యక్షత జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ అమిత్‌ షా వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఖండించకపోవడం దారుణమన్నారు. అమిత్‌ షా రాజీనామా చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో దేశపౌరులకు వాక్‌ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ ఉండటానికి కారణం రాజ్యాంగమని వివరించారు. అంబేద్కర్‌ లేకపోతే ప్రధాన మంత్రి పదవి తనకు దక్కేది కాదని రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో నరేంద్ర మోడీ అన్న మాటలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు వామపక్షాలతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జగన్‌ గొంతు కలపాలని, లేదంటే రాష్ట్రంలో పుట్టగతులుండవని హెచ్చరించారు. సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు హరనాథ్‌, సిపిఎం న్యూడెమోక్రసీ నాయకులు పోలారి, ఎంసిపిఐయు నాయకులు ఖాదర్‌ బాషా మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న కేంద్రప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ ప్రసంగించారు. అనంతపురం జిల్లా అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసన తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, ధర్మవరం, రొద్దం తదితర ప్రాంతాల్లో వామపక్ష నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ భీమవరం, ఏలూరు జిల్లాల్లో నినదించారు. కర్నూలు జిల్లా ఆదోని, కోడుమూరు, నంద్యాల జిల్లా కొత్తపల్లి, నందికొట్కూరు, ఆత్మకూరు, బేతంచర్ల, డోన్‌, సున్నిపెంటలో నిరసన తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరు, మైలవరం, చీమలపాడులోనూ, వామపక్షాల ఆధ్వర్యాన కృష్ణా జిల్లా గన్నవరంలోనూ నిరసనలు హోరెత్తాయి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సిపిఎం, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించారు. పాచిపెంట, కొమరాడ మండలాల్లో నిరసనలు జరిగాయి. అనకాపల్లి, సబ్బవరం, చోడవరం, ఎస్‌.రాయవరం, అల్లూరి జిల్లా విఆర్‌.పురం మండలం రేఖపల్లి, కూనవరం, పాడేరు మండలాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌ (న్యూడెమోక్రసీ), సిపిఐ ఎంఎల్‌ ప్రజాపోరు పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

అమిత్‌ షాకు విందు ‘సిగ్గు చేటు’ : దళిత, గిరిజన, ప్రజాసంఘాలు
రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమంత్రి అమిత్‌ షాకు సిఎం చంద్రబాబు నివాసంలో విందు ఇవ్వడం సిగ్గు చేటని దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని బందరు రోడ్డులోగల అంబేద్కర్‌ స్మృతివనం వద్ద నిర్వుహించిన నిరసన కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే, రాష్ట్రంలో అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీల అధినేతలు నేరు మెదపకపోవడం శోచనీయమన్నారు. అమిత్‌ షాను విందు ఇచ్చి సత్కరించడం దళితులను అవమానిండమేనని పేర్కొన్నారు. దేశంలో మనుస్మృతి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్‌, జై భీమ్‌రావ్‌ పార్టీ నాయకులు కొండలరావు, అంబేద్కర్‌ మిషన్‌ అధ్యక్షులు రామారావు, ఆమ్‌ఆద్మీ పార్టీ కో-ఆర్డినేటర్‌ నేతి మహేశ్వరరావు, ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘటన అధ్యక్షులు మరీదు ప్రసాద్‌బాబు, డివైఎప్‌ఐ నాయకులు సురేష్‌, ముస్లిం లీగ్‌ నాయకులు మహమ్మద్‌ ముస్తాఫ్‌, కెవిపిఎస్‌ నాయకులు పాల్గన్నారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యాన ఎన్‌టిఆర్‌ జిల్లా విస్సన్నపేటలో నిరసన తెలిపారు.

➡️