ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జై బాపూజీ, జై భీం, జై సంవిధాన నినాదం బ్రోచర్‌ను ఆమె శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను హేళన చేస్తుంటే టిడిపి, వైసిపి, జనసేన ఎంపిలు మౌనం వహించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలను మోడీ వెన్నుపోటు పొడిచారని, హోదా ఇస్తామని మోసం చేశారని, అలాంటి మోడీని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు పల్లెత్తు మాట అనకపోవడం దారుణమన్నారు. మోడీ విశాఖ వచ్చి విభజన హామీలపైనా, విశాఖ ఉక్కుపైనా ఎటువంటి ప్రకటనా చేయలేదన్నారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్న మోడీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ అంటకాగుతున్నారని విమర్శించారు. దేశ సంపదను అదానికి కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఎంపి మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ బిజెపికి రాజ్యాంగమంటే గౌరవం లేదని విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేగి వెంకటేష్, పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు లక్కరాజు రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని షర్మిల సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేశారు.