ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 18వ తేదీన గన్నవరం రాబోతున్నారని గురువారం బిజెపి ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 18వ తేదీ రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అవుతారని.. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేయనున్నారు. 19వ తేదీన కృష్ణా జిల్లా, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.